దుబాయ్: టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొని ఇరాన్ వార్ వల్ల కొన్ని విదేశీ జట్లు ఇండియాలోనే చిక్కుకున్నాయి. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ప్లేయర్లు ఇంకా ఇంటికి వెళ్లలేకపోతున్నారు. అయితే ఈ అంశంపై ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) కీలక ప్రకటన చేసింది. విండీస్, సఫారీ క్రికెటర్ల ఆవేశాన్ని అర్థం చేసుకున్నట్లు చెప్పింది. ఆ దేశ ఆటగాళ్లకు ఐసీసీ తన సంఘీభావాన్ని ప్రకటించింది. కానీ భద్రతను దృష్టిలో పెట్టుకుని క్రికెటర్లకు ఏర్పాట్లు చేసినట్లు ఐసీసీ పేర్కొన్నది. టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 8 స్టేజ్ వరకు వెస్టిండీస్ ఆడింది, ఇక సెమీస్ వరకు దక్షిణాఫ్రికా ఆడిన విషయం తెలిసిందే.
కానీ ఇరాన్ సంక్షోభం వల్ల విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విండీస్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు కొందరు ఇండియాలోనే ఉండిపోయారు. అయితే బుధవారం రాత్రి వరకు దక్షిణాఫ్రికా క్రికెటర్లు తమ స్వదేశానికి వెళ్లే ఏర్పాటు చేసినట్లు ఐసీసీ తెలిపింది. మరో 36 గంటల్లో దక్షిణాఫ్రికా క్రికెటర్లు పయనం గురించి ఏర్పాట్లు చేసినట్లు ఐసీసీ పేర్కొన్నది. ఇక విండీస్‌కు చెందిన 9 మంది ఆటగాళ్లు ఇప్పటికే వెళ్లిపోయారు. మరో 16 మంది క్రికెటర్ల ప్రయాణం కోసం కమర్షియల్ ఫ్లయిట్స్‌ను బుక్ చేసినట్లు ఐసీసీ తన ప్రకటనలో పేర్కొన్నది.
వెండీస్ , దక్షిణాఫ్రికా తమ చివరి మ్యాచ్‌లను కోల్‌కతాలో ఆడాయి. అయితే అక్కడ నుంచి ఛార్టర్ ఫ్లయిట్ రద్దు కావడంతో ఐసీసీ కొత్తగా కమర్షియల్ ఫ్లయిట్లను బుక్ చేసింది. సహకరించిన ప్లేయర్లు, మేనేజ్మెంట్, బోర్డులకు ఐసీసీ థ్యాంక్స్ చెప్పింది. కష్ట సమయంలో చాలా ఓపికగా ఉన్నట్లు పేర్కొన్నది. ఆయా క్రికెట్ మేనేజ్మెంట్లతో తమ బృందం నిత్యం టచ్‌లోనే ఉన్నట్లు ఐసీసీ తన ప్రకటనలో చెప్పింది.