హైదరాబాద్, జూలై30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన లైంగికదాడుల గురించి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి 48 గంటలు కాకముందే మరో మూడు ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఒకరోజే రాష్ట్రంలో మూడు లైంగికదాడి ఘటనలు జరగడం బాధాకరమని, సిగ్గుతో తలదించుకోవాలని ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు.
వరుస ఘటనలు చోటుచేసుకుంటుంటే చట్టాలు చేసే అసెంబ్లీలో ఉండి ఎందుకనే స్వీయ ప్రశ్న అందరూ వేసుకోవాలని కోరారు. పదేండ్లు మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై జరిగిన సామూహిక లైంగికదాడి, నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై లైంగికదాడి, నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై డ్రైవర్ లైంగికదాడి ఘటనలను హరీశ్‌రావు ఉదహరించారు. లైంగికదాడి బాధితులకు ప్రభుత్వం వెంటనే భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్షలు పడేలా చొరవ చూపాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.