శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 21, 2020 , 16:59:09

కరోనా కట్టడి కోసం.. సింగరేణి పటిష్ట చర్యలు

కరోనా కట్టడి కోసం.. సింగరేణి పటిష్ట చర్యలు

మంచిర్యాల : సింగరేణి వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ  సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ ఆదేశం మేరకు పలు ముందస్తు జాగ్రత్త చర్యలను యాజమాన్యం తీసుకొంది. 11 ఏరియాల్లో గల కంపెనీ దవాఖానల్లో ప్రత్యేక కరోనా వార్డుల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే క్వారంటైన్‌ సెంటర్లుగా అన్ని ఏరియాల్లో గల సి.ఇ.ఆర్‌. క్లబ్బులు, కమ్యూనిటీ హాల్స్ సింగరేణి పాఠశాలలు తదితర భవనాలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ వివరాలను డైరెక్టర్‌ (పా)  ఆపరేషన్స్‌  ఎస్‌.చంద్రశేఖర్‌ వెల్లడించారు. 

సింగరేణి వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున ఏరియాల్లో క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, వ్యాధి మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి క్వారంటైన్‌ సెంటర్‌ లో ఒక డాక్టరు, అవసరమైన వైద్య సిబ్బంది ఉండి 24 గంటలు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. క్వారంటైన్‌ లో ఉన్నవారిలో వ్యాధి తీవ్రత ముదిరితే వారికి హైదరాబాద్‌ లో అత్యవసర సేవలందించడానికి కంపెనీ మూడు సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలతో అంగీకారం కుదుర్చుకుందని తెలిపారు.


సింగరేణి వ్యాప్తంగా కరోనా వ్యాధి సోకిన వారి వైద్యం కోసం ఖరీదైన మందుల్ని అందుబాటులో ఉంచుతున్నామని, ఒక్కొక్కటి 14 వేల రూపాయల ఖరీదైన యాంటీ వైరల్‌ డోసులను కూడా కంపెనీ సమకూర్చుకొంటోందని పేర్కొన్నారు. కరోనా వ్యాధి సంక్రమించకుండా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు చాలా అప్రమత్తంగా  ఉంటూ జాగ్రత్తులు తీసుకోవాలని సూచించారు. 

సింగరేణిలో కరోనా వైద్య సేవల్లో ప్రత్యక్షంగా పనిచేసే డాక్లర్లు, ఇతర వైద్య సిబ్బంది అందరికి, రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ప్రతి నెల వారి బేసిక్‌ జీతంపై 10 శాతం ప్రత్యేక ప్రొత్సాహక అలవెన్సు ఇప్పటి నుంచి చెల్లిస్తుందన్నారు. అలాగే ప్రభుత్వం కల్పించిన 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కొవిడ్‌ సేవల్లో పనిచేసిన వారికి వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఏదైనా గనిలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లయితే అక్కడ పనిచేసే కార్మికుల రక్షణ, ఆరోగ్యం దృష్ట్యా ఆ గనిని కొద్దికాలం పాటు మూసివేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే గనుల మీద ఇప్పటి నుంచి రాబోయే 2 నెలల కాలం పాటు ఏ కార్మిక సంఘం వారికి కూడా సమావేశాలకు అనుమతించబోమని సృష్టం చేశారు. కరోనా వ్యాధి సోకిన వారికి ప్రత్యేక క్వారంటైన్‌ సెలవులను యాజమాన్యం మంజూరు చేస్తుందని తెలిపారు. logo