Harish Rao | హైదరాబాద్ : రుణమాఫీ లెక్కనే పాలమూరు అభివృద్ధి హామీ ఉంటదేమో అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. పాలమూరుకు ఏం చేసావని కేసీఆర్‌ను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది అని నిలదీశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రైతు పండుగ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే రైతుల పట్ల ప్రేమ కంటే, గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే కనిపించింది. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని చెబుతున్నవు. పాలమూరు సభ సాక్షిగా ఏ రైతులను బెదిరిస్తున్నావు. పాలమూరు బిడ్డగా ఇది నీకు న్యాయమా? రేవంత్ రెడ్డి. ఒకసారి ఫార్మాసిటీ అని గెజిట్ ఇచ్చి, బీఆర్ఎస్ పోరాటంతో వెనక్కి తగ్గి ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అని ప్రచారం చేస్తున్నావు. ఎటు వాటమైతే అటు మాట్లాడటం నీకే చెల్లింది. మాకొద్దు ఫార్మాసిటీ అంటూ లగచర్లలో లడాయి చేసిన గిరిజన బిడ్డలను అరెస్టులు చేసి జైలుకు పంపించావు. ఇప్పుడేమో సొంత జిల్లా ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కార్చుతున్నావు. రుణమాఫీ చేస్తానని నూటొక్క దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పావు. ఇప్పుడు నీ మంత్రుల సాక్షిగా ఒట్టు వేసి పాలమూరు అభివృద్ధికి మాటిచ్చావు. రుణమాఫీ లెక్కనే పాలమూరు అభివృద్ధి హామీ ఉంటదేమో అని హరీశ్‌రావు సెటైర్లు వేశారు.
పాలమూరుకు ఏం చేసావని కేసీఆర్‌ను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది..? కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్, వలసలను వాపస్ తెచ్చింది కేసీఆర్. మీ పాలనలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27 వేల ఎకరాలు సాగైతే, దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి 90 శాతం పూర్తి చేస్తే, ఏడాది పాలనలో మీరు మిగిలిన చివరి పనులు కూడా పూర్తి చెయ్యక చోద్యం చూస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదైతే అది కూడా మీ ఖాతాలో వేసుకున్నావు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రైతు పండుగ పేరుతో రైతులకు మరోసారి మోసం.. రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజం
Y Satish Reddy | రైతన్నలకు రేవంత్ రెడ్డి రూ. 63 వేల కోట్ల మోసం : సతీష్ రెడ్డి