హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ఎక్సైజ్‌శాఖలో బదిలీల ప్రక్రియకు మోక్షం లభించనున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. వారంలోగా సుమారు 2,500 మంది కానిస్టేబుళ్ల బదిలీలను పూర్తి చేస్తామని, అనంతరం ఇతర హోదాల్లోని అధికారుల బదిలీలను దశలవారీగా చేపడుతామని వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్‌శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేసిన ఒక్కరోజు పెన్షన్ మొత్తం రూ.2.80 లక్షల చెకును మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సచివాలయంలో సౌమ్య కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టకాలంలో ఉన్న సహోద్యోగి కుటుంబానికి విశ్రాంత ఉద్యోగులు తమ పెద్ద మనసుతో అండగా నిలువడం అభినందనీయమన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.కోటి ఆర్థిక సాయంతోపాటు ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు ముకుందరెడ్డి, ప్రతినిధులు విష్ణుస్వరూప్ రెడ్డి, నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సౌమ్య కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
‘కుమ్మెర’ ఘటన విచారకరం..
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలోని మల్లికార్జున స్వామి జాతరలో పసికందు మృతిపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. దేశ, విదేశీ పర్యాటకులకు కేరాఫ్ అడ్రస్‌గా రాష్ర్టాన్ని మార్చేందుకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు మంత్రి తెలిపారు. నూతన పర్యాటక విధానంతో వాటర్ స్పోర్ట్స్, ఎకో, వెల్నెస్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు వెల్లడించారు.