Anil Ravipudi | టాలీవుడ్లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందువరుసలో ఉంటుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్కు కుటుంబ కథలను జోడిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకోవడం ఆయన ప్రత్యేకత. తొలి సినిమా ‘పటాస్’ నుంచి తాజాగా విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వరకు వరుస విజయాలతో అనిల్ రావిపూడి తన విజయపరంపరను కొనసాగిస్తున్నారు.’ఎఫ్2′, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భగవంత్ కేసరి’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడమే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. వినోదాన్ని ప్రధాన బలంగా చేసుకుని కమర్షియల్ సినిమాలను రూపొందించే దర్శకుడిగా అనిల్ రావిపూడి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకెళ్తుండటంతో ఆయనతో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమాచారం ప్రకారం, ‘పెద్ది’ చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు ఇప్పటికే అనిల్ రావిపూడికి అడ్వాన్స్ ఇచ్చి ఒక ప్రాజెక్ట్‌ను లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కూడా ఒక సినిమా చేయడానికి ఆయన అంగీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కూడా మరో ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయని ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు అనిల్ రావిపూడి కాల్షీట్స్ కోసం పోటీ పడుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అనిల్ రావిపూడిపై నిర్మాతలకు ఉన్న నమ్మకానికి ప్రధాన కారణం ఆయన వర్కింగ్ స్టైల్. కథకు తగ్గట్టుగా కమర్షియల్ అంశాలను మేళవించడమే కాకుండా, ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం చిత్రీకరణ పూర్తి చేయడం, బడ్జెట్‌ను నియంత్రణలో ఉంచడం ఆయన ప్రత్యేకతగా చెప్పబడుతోంది. సినిమా నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేసే దర్శకులతో పనిచేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ కారణంగానే అనిల్ రావిపూడి వంటి విజయవంతమైన దర్శకులతో ముందుగానే ఒప్పందాలు చేసుకునేందుకు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వరుస బ్లాక్బస్టర్లతో తన సత్తా చాటుతున్న అనిల్ రావిపూడి, రాబోయే రోజుల్లో కూడా అదే విజయపరంపరను కొనసాగిస్తారా అనే ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది.