Ram Gopal Varma | నీట్ (NEET) పరీక్ష వివాదం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామాల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విద్యా వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నీట్ పరీక్ష సమస్య కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏ అసలైన సవాలు అని పేర్కొంటూ ప్రస్తుత విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బట్టీ పట్టి, పరీక్షలు రాసి, డిగ్రీలు సాధించి ఉద్యోగాలు పొందే పాత పద్ధతిని తక్షణమే పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందని వర్మ అభిప్రాయపడ్డారు.
వైద్య విద్య ఉదాహరణను ప్రస్తావిస్తూ.. ఒక మెడికల్ విద్యార్థి ఎంబీబీఎస్, పిజీ మరియు స్పెషలైజేషన్ కోసం సుమారు 10 సంవత్సరాల సమయాన్ని వెచ్చిస్తున్నాడని, అయితే చిన్న మొబైల్లోని AI సాంకేతికత దానికి సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో అందించగలుగుతోందని తెలిపారు. వ్యాధి నిర్ధారణ టెస్ట్‌ల ద్వారా, శస్త్రచికిత్సలు రోబోల ద్వారా వేగంగా జరుగుతున్న తరుణంలో, ఇంకా నీట్ పరీక్షల కోసం సంవత్సరాల తరబడి శ్రమించడం దండగేనని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే 1-2 ఏళ్లలో వైద్య రంగంలో ఏఐ పూర్తిస్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుందని నిపుణులు చెబుతున్నారని గుర్తుచేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజంలో వస్తున్న ఈ మార్పులను గమనించకుండా పాత విధానాలనే రుద్దుతున్నారని, ప్రస్తుత విద్యా వ్యవస్థ పూర్తిగా మనుగడ కోల్పోయిందని వర్మ విమర్శించారు. యువత భవిష్యత్తు నాశనం కాకముందే సాంప్రదాయ విద్యా విధానాన్ని అంతం చేసి, వారిని పూర్తిగా ఏఐ దిశగా ప్రోత్సహించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.