సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : మహానగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త, వ్యర్థాలను కాలుస్తూ కాలుష్య కాసారంగా మారుస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా మున్సిపల్ వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలను దహనం చేస్తూ విష వాయువులను వెదజల్లుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెడుతూ తీవ్రమైన వాయు కాలుష్యం, ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నారు. దీంతో గాలిలో పీఎం-10, పీఎం-2.5 ధూళి కణాలతో పాటు విష వాయువులు పెరిగిపోయి గాలి నాణ్యత గణనీయంగా క్షీణతకు గురవుతున్నది.
గాలి నాణ్యత క్షీణించడం ప్రపంచ ఆరోగ్య సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను మించి పోతున్నది. మున్సిపల్, కాలుష్య నియంత్రణ అధికారుల నిఘా కొరవడటంతో యథేచ్ఛగా సాగుతున్నది. నగర పౌరులకు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం వల్ల జరిగే దుష్పరిణామాల గురించి కనీస అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. చెత్తను కాల్చడం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నది.
మున్సిపల్, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల్లో సఖ్యత లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులు మాత్రం ఖర్చవుతున్నాయి. వాటి వినియోగం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరడంలేదు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడాన్ని నిరోధించేందుకు ఎన్సీఏపీ నిధుల్లో రూ.27 లక్షలు ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలకు అందించారు. దాని ఫలితం మాత్రం శూన్యం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట బహిరంగ ప్రదేశాల్లో చెత్తను దహనం చేస్తున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలి ప్రాంతాల్లో ఏటా దాదాపుగా 30 వేల టన్నులకు పైగా వ్యర్థాలను దహనం చేస్తున్నట్లు అంచనా. జీహెచ్ఎంసీతో పాటు శివారు మున్సిపాలిటీల్లో పటిష్టమైన అధికార యంత్రాంగం ఉన్నా కనీస తనిఖీలు నిర్వహించకపోవడంతో అది నిత్యకృత్యమైంది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలకు రూ.లక్ష చొప్పున రూ.27 లక్షలు అందజేశారు. కానీ ఆ డబ్బుతో అధికారులు ఎక్కడా అవగాహన కల్పించిన దాఖలాలు కనిపించడంలేదు.
బాహాటంగానే చెత్తను కాలుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దాని వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు చెప్పేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా జరుగుతున్నది. రూ.లక్షలాదిగా నిధులను ఖర్చు చేయడమే కానీ ఫలితం మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చినవారికి జరిమానాలు విధిస్తామని బోర్డులు, పోస్టర్లను అంటిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ఆ దిశగా అధికారులు పనిచేయడంలేదు. శివారు ప్రాంతాల్లోని నిర్మాణాలు జరిగే చోట చెత్తను, నిర్మాణ వ్యర్థాలను కాల్చడం పరిపాటిగా మారిపోయింది. కానీ రికార్డుల్లో చూపించుకునేందుకు ఎక్కడో ఒకచోట నామమాత్రంగా జరిమానాలు విధిస్తూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారని నగర ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి నిరంతర నిఘా ఉంచుతూ బహిరంగ దహనానికి అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు.
వ్యర్థాలను బహిరంగంగా కాల్చివేయడం వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదమున్నది. ముఖ్యంగా నాడీ, హృదయ సంబంధ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలుష్యం వల్ల ఉబ్బసం, ఎంఫైసిమా, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, సంతాన సమస్యలు వస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం ద్వారా వచ్చిన పొగను పీల్చడం ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు ప్రమాదకరం.
కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, లెడ్, ఆర్సెనిక్ వంటివి గాలిలో కలిసిపోయి ప్రాణాంతకంగా మారుతాయి. ప్లాస్టిక్, ఈ-వ్యర్థాలను కాల్చడం వల్ల వాటి నుంచి వెలువడే కాలుష్య కారకాల వల్ల క్యాన్సర్లు సంభవించే ప్రమాదముంటుందని వైద్య, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా దాని వల్ల కలిగే దుష్పరిణామాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా మున్సిపల్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.