Y Satish Reddy | హైదరాబాద్ : రైతు పండుగ పేరుతో గప్పాలు కొట్టుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రైతులను నిండా ముంచారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి మండిపడ్డారు. ఏడాదిలో రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం మాది అని ప్రచారం చేసుకుంటున్నారు. దండగ పనులు చేస్తూ.. రైతు పండుగ అంటూ పొంకనాలు కొడుతున్నారు. కానీ ఇదే తెలంగాణ రైతన్నలకు రేవంత్ రెడ్డి ఈ ఏడాదిలో రూ.63,000 కోట్ల మోసం చేశారని సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ రూ. 40,000 కోట్లు చేయాల్సి ఉంటే.. రూ. 18,000 కోట్లు చేసి మిగతా రూ.22,000 కోట్లు ఎగ్గొట్టాడు. భూమి ఉన్న రైతులకు ఎకరాకు 15 వేల రైతు భరోసా ఇస్తామన్నారు. ఆ లెక్కన ఒకసారి రైతు భరోసా 11,400 కోట్లు ఇవ్వాలి. ఈ లెక్కన ఈ సంవత్సరం రెండు సార్లు కలిపి రూ.22,800 కోట్లు చేయాలి. కానీ 7,600 కోట్లు ఇచ్చి 15,200 కోట్లు మోసం చేశాడు. వ్యవసాయ కూలీలకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పాడు. రాష్ట్రంలో 1 కోటి మంది కూలీలు ఉన్నారు. అందులో 60 లక్షల మంది ఉపాధి హామీ పథకాన్ని వాడుకుంటున్నారు. కనీసంగా ఒక్కొక్కరికి ఒక ఎకరా లెక్క వేసుకున్నా.. 60 లక్షల రైతు కూలీలకి రూ. 14,400 కోట్లు ఇవ్వాలి. ఇందులో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రైతు కూలీలకు ఇవ్వలేదు అని సతీష్ రెడ్డి తెలిపారు.
వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పారు. పోయిన యాసంగి పంటకు చేయాల్సింది 75 లక్షల మెట్రిక్ టన్నులు.. క్వింటాల్‌కు రూ. 500 బోనస్ లెక్కేస్తే రూ.3,750 కోట్లు అవుతుంది. ఈ వానాకాలంలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే చెప్పారు. ఈ లెక్కన క్వింటాల్‌కు రూ.500 లెక్కేస్తే.. రూ.7,650 కోట్లు. ఇందులో ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ. 25 కోట్లే. అంటే రూ.7,625 కోట్లు రైతులకు ఇవ్వకుండా మోసం చేశారు. ఈ మోసాలన్నీ కలిపితే వీటి మొత్తం రూ.63 వేల కోట్లు. ఇవి కాకుండా పంటలకు మద్ధతు ధర ఇస్తామన్నారు. మొక్కజొన్నకు రూ.2200, కందులకు రూ.6700, సోయాబీన్‌కు రూ.4400, పత్తి రూ.6500, మిర్చి రూ.15 వేలు, పసుపు రూ.12 వేలు, ఎర్రజొన్న రూ.3500, చెరుకు రూ.4000, జొన్నలు రూ.3050 ఇస్తామని చెప్పి అన్నీ ఎగ్గొట్టారు. అవి కూడా కలిపితే… ఈ మోసం లక్ష కోట్లకు పోయినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి, నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి ఓట్లేయించుకుని గెలిచి రైతులకిచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టి ఇప్పుడు రైతుపండుగ పేరుతో.. రైతులకు ఏదో చేసినట్టుగా కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. దౌర్భగ్యం ఏంటంటే.. వరిధాన్యం కొనుగోలుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులను కూడా.. తామేదో జేబుల్లోంచి ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి ఇది ఓ మచ్చుతునక. వరిధాన్యం కొనుగోలుకు ఖర్చుపెట్టిన డబ్బులకు కమీషన్ కూడా కలిపి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. కానీ రేవంత్ రెడ్డికి ఆ విషయం కూడా తెలియదు. కేవలం ప్రతీదాన్ని పబ్లిసిటీ చేసుకోవడం.. చేయనిది కూడా చేసినట్టుగా చెప్పుకోవడం తప్ప.. రాష్ట్రంలోని రైతులకు, ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు చేసింది ఏం లేదు. పబ్లిసిటీ చేసుకున్నంత మాత్రానా.. పని చేసినట్టు కాదు అనే విషయం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. రైతుపండుగ పేరుతో రైతులకు దగా చేస్తున్న విషయాన్ని ఒప్పుకుని.. రాష్ట్రంలోని రైతన్నలకు క్షమాపణలు చెప్పాలి. పదే పదే రైతన్నను మోసం చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి అదే రైతుల కాళ్లు మొక్కి క్షమించమని అడగాలి అని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | బీఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్‌లో వణుకు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్