Balka Suman |కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తోందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమంపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి బాల్క సుమన్ పాల్గొన్నారు. అనంతరం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నయా దేశ్‌ముఖ్ అని విమర్శించారు.
గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ స్కూళ్లు , హాస్టళ్లలో చదివే వాళ్లంతా పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలు అని బాల్క సుమన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రక్తంలో అణువణువునా ఆధిపత్య భావజాలం ఉందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విద్య దక్కకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు. అందుకే విద్యాశాఖ, సంక్షేమ శాఖలను రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక11 నెలల్లోనే 860 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారని పేర్కొన్నారు. 48 మంది చనిపోయారని చెప్పారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
కార్పొరేట్ సంస్థలతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం సొంత జిల్లాలోని స్కూళ్లో మూడుసార్లు ఫుడ్‌పాయిజన్ జరిగితే ఇంతవరకు ముఖ్యమంత్రి సమీక్ష జరపలేదని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేస్తానని రేవంత్ రెడ్డి గురుకులాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కట్టించిన అంబేడ్కర్ సచివాలయంలో రేవంత్ రెడ్డి ఎలా కూర్చుంటున్నారని ప్రశ్నించారు. అధికార మదంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏనాడూ సమీక్ష జరపలేదని తెలిపారు.
కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మంత్రులు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. గురుకులాలు బాగుంటే మేం ప్రశ్నించే అవసరం ఏముందని ప్రశ్నించారు. దీక్షా దివస్ స్ఫూర్తిగా గురుకులాల బాట నిర్వహిస్తామని తెలిపారు. కేసీఆర్ మీద కోపంతో గురుకులాలను ధ్వంసం చేయవద్దని సూచించారు. బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరారు. మేం పనిలో పోటీ పడేవాళ్లమే కానీ.. పైరవీల కోసం పోటీ పడేవాళ్లం కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో సీట్లు దొరకలేదని.. ఇప్పుడు 40 శాతం సీట్లు ఖాళీగానే ఉన్నాయని అన్నారు.
మంత్రి కొండా సురేఖ ఆరోపణలు దుర్మార్గంగా ఉన్నాయని బాల్క సుమన్ మండిపడ్డారు. బీఆర్ఎస్ బృందాలు విద్యా సంస్థలతో అధ్యయనం చేస్తాయని తెలిపారు. 33 జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో అధ్యయనం చేస్తామని అన్నారు. గురుకులాల్లోని సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కాపాడుకునేందుకు పోరాడుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బృందాలకు ప్రజలు సహకరించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి విభాగం అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. నేడు దీక్షా దివస్ స్ఫూర్తితో విద్యాలయాల రక్షణకు పోరాడతామని వెల్లడించారు.