రామగిరి, మార్చి 13 : నిరుద్యోగ సమస్యలపై నిరుద్యోగ మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన నివాసం వద్దకు చేరుకున్న నార్కట్‌పల్లి పోలీసులు నవీన్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల సమస్యలపై భారీ ప్రదర్శన నిర్వహించేందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, అసెంబ్లీలో రెండు లక్షల ఉద్యోగాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.