Retirment Benefits | మహబూబాబాద్ జిల్లా గూడూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బంగ్లా వాచర్‌గా పనిచేసిన కనకం భాగ్యలక్ష్మి 2024 జూన్ 30న ఉద్యోగ విరమణ పొందారు. రెండేండ్లు గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో తీవ్ర మానసిక వేదనతో.. బ్లడ్ ప్రజర్ పెరిగి బ్రెయిన్‌స్ట్రోక్‌తో ఈ నెల 7న కన్నుమూశారు. హనుమకొండ ఏనుగుల గడ్డలోని ఆమె ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. పిల్లల పెండ్లిళ్లు చేసి, అప్పుల భారం మోయలేక మానసిక మనోవేదనకు గురైంది. ప్రైవేట్ దవాఖానలో ఈహెచ్ఎస్ కార్డు పనిచేయకపోవడంతో అప్పుచేసి వైద్యం చేయించినా మనిషి బతకలేదు.
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ ప్రజా పాలనలో.. తెలంగాణ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూనైనా ఉండాలి.. లేదా వాటి గురించే ఆలోచిస్తూ చనిపోయి ఉండాలి. అప్పుడే మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి’ అని పలు శాఖల రిటైర్డ్ ఉద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవ చేసినా.. తాము కడుపుకట్టి దాచుకున్న డబ్బులు అవసాన దశలో అనుభవించకుండా చనిపోతున్నామనే బాధ వారిని నిలువునా దహించివేస్తున్నది. ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు ఎప్పుడు వస్తాయో తెలియక మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారు.
మొదట్లో ఉద్యోగం వచ్చిన తర్వాత బాగానే ఉన్నామని.. అప్పుడు కనీసం సొంతిల్లు కట్టుకోవాలనే ఆలోచన కూడా రాలేదని కొందరు రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు పిల్లల చదువుల కోసం కష్టపడ్డామని, వయసొచ్చాక వారి పెండ్లిళ్ల కోసం అప్పులు కూడా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. అదే సమయంలో పిల్లల చదువులు, ఉన్నత విద్య, విదేశీ విద్య కోసం నెలవారీ జీతం సరిపోక అప్పులు చేయాల్సి వచ్చిందని కొందరు చెప్పారు. సరిగ్గా రిటైర్మెంట్ దగ్గరిగా ఉన్న సమయంలోనే అనారోగ్యం వెంటాడుతున్నదని, డబ్బులు దవాఖానలకే ధారపోస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. దాదాపు 90% మంది అనేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రుల దీనావస్థ మాటల్లో చెప్పలేనిదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
తెలంగాణలో రిటైర్మెంట్ అయిన ఒక్కో పోలీసు కుటుంబానికి ప్రభుత్వం నుంచి కనీసం రూ.60 లక్షల వరకు రావాలని అంటున్నారు. గత్యంతరం లేక హైకోర్టును సైతం ఆశ్రయిస్తున్నా.. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని, చావుబతుకుల్లో ఉన్నా కూడా కనికరించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు ఈ రెండేండ్లలో సుమారు 3,500 మంది పోలీసులు రిటైర్ కాగా వారిలో ఒక్కశాతం మంది కి మాత్రమే బకాయిలు వచ్చాయని, ఇంకా 99% మంది వాటి కోసం వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ పాలనలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక.. వివిధ శాఖలకు చెందిన సుమారు 73 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తున్నారు. వారిలో సుమారు 30 మందికిపైగా పోలీసుశాఖకు చెందిన వారు ఉన్నారని తోటి పోలీసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని, కొందరు తమ కండ్ల ముందు కనుమరుగైపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఏఆర్ ఎస్ఐ మైసయ్యకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. దీంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో చనిపోయారు.
ఈ దుర్ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో మరుసటి రోజే అతని ఖాతా సెటిల్ చేశారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లికి చెందిన రిటైర్డ్ ఎస్సై ఖాజా మొయినుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం వరంగల్‌కు చెందిన వీవీఎల్ఎన్ మూర్తి సికింద్రాబాద్ యశోద దవాఖానలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభుత్వం స్పందించి తమ బెనిఫిట్స్ తక్షణం విడుదల చేయించాలని వేడుకుంటున్నాడు.
‘అయ్యా..! ముఖ్యమంత్రి గారూ..! చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నానయ్యా. మూడు దశాబ్దాలుగా పోలీసు శాఖకు సర్వీసు చేశాను. ఇప్పటికీ సొంతిల్లు కూడా లేదు. ఇద్దరు బిడ్డలకు పెండ్లిళ్లు చేసి పంపిన. రిటైర్మెంట్ డబ్బులపైనే ఆధారపడ్డాం. నా భార్యకు కూడా ఒంట్లో బాగోలేదు. నాకు గతంలోనే హార్ట్ ఆపరేషన్ అయింది. మళ్లీ హార్ట్స్ట్రోక్ వచ్చింది. ఇప్పటికే రూ.3 లక్షల ఖర్చు అయింది. మీరు డబ్బులివ్వకపోతే.. మాకు చావే శరణ్యం’
– వీవీఎల్ఎన్ మూర్తి (రిటైర్డ్ ఏఎస్ఐ/1732), సికింద్రాబాద్ యశోద దవాఖాన నుంచి