Harish Rao | హైదరాబాద్ : రైతు పండుగ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రైతు పండుగ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
మహబూబ్ నగర్ రైతు పండుగలో రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎంత మొత్తుకున్నా దండుగే అయ్యింది. ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరు మనిపించింది. ఏడాది పూర్తయిన సందర్భంగానైనా రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు ఈ యాసంగికి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలుపుకొని ఎకరాకు రూ. 15 వేలు ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చెయ్యి చూపారు. ఇక కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతు బంధుకు అతీగతీ లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అంటూ గప్పాలు కొట్టుకోవడం సిగ్గుచేటు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదు, మా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే కోటి 53 లక్షల టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది. మీరు చెప్పిన ప్రాజెక్టులు 2014లో కూడా ఉన్నాయి. మరి అప్పుడు 68 లక్షల టన్నుల వరి మాత్రమే ఎందుకు పండింది రేవంత్ రెడ్డి? 2023-24 నాటికి కోటి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఎలా సాధ్యం అయ్యింది? 2014-15 లో లక్షా 31 వేల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి 2లక్షల 21 వేల ఎకరాలకు ఎలా పెరిగింది? చెప్పేవాడికి ఇంగితం లేకున్నా వినేవాడికైనా వివేకం ఉంటది కదా! అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Cyclone Fengal | ఫెంగల్ ప్రభావంతో భారీ వర్షాలు.. హైదరాబాద్ నుంచి విమానాలు బంద్
ACB | రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ ఆస్తులు రూ. 17.73 కోట్ల పైనే..