Dasoju Sravan Kumar | హైదరాబాద్ : ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్థిత్వాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విధంగా, ఉద్యమ ప్రతి రూపంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంటే నిప్పుతో చెలగాటమే అని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ తల్లి అంటే ఓ దేవత, భూ మాత. తెలంగాణ తల్లికి కిరీటం ఉండద్దట.. దేవతకు కిరీటం ఉండకూడదా..? అని సీఎం రేవంత్ రెడ్డిని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ప్రతి పల్లెలో, గల్లీల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. ఎన్నింటిని విధ్వంసం చేస్తావ్? రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం.. ఒక వేళ కిరీటం రాచరికానికి సింబల్ అయితే.. హిందూ సంప్రదాయమైన దేవుళ్లకు కిరీటం ఉంది. అందరి దేవుళ్లకు కిరీటం తీసేస్తావా రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లికి దేవత స్వరూపం ఉండాలని కిరీటం పెడితే దాన్ని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నవ్. కిరీటం అనేది సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకం అయితే.. రేవంత్ రెడ్డి కూడా రెడ్డి అని పెట్టుకోవడం సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకం. ఎందుకంటే ఆయనే అన్నడు.. రెడ్డి అంటే మేం రాజులం. మేం భూస్వాములం. మేం రాచరికం కోసమే పుట్టినం. పరిపాలించడం కోసమే పుట్టినం. మేమంతా భూస్వాములుగా ఉండాలని పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సామాజిక, ఉద్యమ స్ఫూర్తి లేకుండా అధికారం అడ్డం పెట్టుకుని చిల్లర మల్లరగా చేస్తున్న ప్రయత్నం దుర్మార్గం. పిచ్చోడి చేతిలో రాయిలా మారింది పరిపాలన. అధికారం ఉందని విర్రవీగుతూ ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్పై కోపంతో.. తెలంగాణపై కోపంతో సైకోలా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
తెలంగాణ అస్తిత్వంపై, ఆత్మపై రేవంత్ రెడ్డి దాడి చేస్తున్నాడు. కేసీఆర్పై అక్కసుతో మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పెద్ద పాపం చేస్తుండు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా అనే సోయి లేకుండా విచ్చలవిడిగా ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు. నీ నిర్ణయం తప్పని ఒప్పుకొని లగచర్లలో ఫార్మాని రద్దు చేసినవ్.. మరి రైతులపై పెట్టిన అక్రమ కేసుల్ని ఎందుకు రద్దు చేయలేదు..? ఇప్పటికీ జైల్లోనే ఉన్న రైతులను ఎందుకు విముక్తి చేయట్లేదు..? వెంటనే రైతులపై, పట్నం నరేందర్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Y Satish Reddy | రైతన్నలకు రేవంత్ రెడ్డి రూ. 63 వేల కోట్ల మోసం : సతీష్ రెడ్డి