Crop Loans | హైదరాబాద్ : అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో విడుత రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
రూ. లక్షా నుంచి రూ. లక్షా యాభై వేల లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతులకు రూ. 6,190 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. తొలి విడుతలో 11.34 లక్షల మంది రైతులకు రూ. 6,035 కోట్లు జమ చేశారు. రుణమాఫీ ద్వారా ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరినట్లు పేర్కొన్నారు. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ. 12,225 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
రెండు విడతల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాకు రూ. 984.34 కోట్లు విడుదల చేశారు. ఈ రెండు విడతల్లో నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 1,37,430 మంది రైతులు లబ్ది పొందారు. నల్లగొండ జిల్లా తర్వాత నాగర్కర్నూల్ జిల్లా నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన నాగర్కర్నూల్ జిల్లాలో రెండు విడతల్లో 80,395 మంది రైతులు లబ్ది పొందగా, రూ. 583.87 కోట్లు విడుదల చేశారు. మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లా నిలిచింది. ఈ జిల్లాకు రూ. 563.99 కోట్ల నిధులు విడుదల చేయగా, 77,951 మంది లబ్ది పొందినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ములుగు జిల్లాలో 17,788 మంది రైతులకు రూ. 130.94 కోట్లు కేటాయించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండు విడతల్లో రూ. 15.56 కోట్లు విడుదల చేసి 2,799 మందికి లబ్ది చేకూర్చారు. ఇక చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్ జిల్లాలో కేవలం ఏడుగురు రైతులు మాత్రమే లబ్ది పొందారు. తొలి విడతలో ముగ్గురు, రెండో విడతలో నలుగురు రైతులకు లబ్ది చేకూరింది.
ఇవి కూడా చదవండి..
KTR | మేం తప్పకుండా సహకరిస్తాం.. వచ్చే సెషన్ 20 రోజులు నిర్వహించాలి : కేటీఆర్