Oil Palm | హైదరాబాద్ : రాష్ట్రంలో పామాయిల్ సాగుకు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆయిల్ పామ్ పంటకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని, ఇది రైతులకు స్థిర ఆదాయం కలిగించే లాంగ్‌టర్మ్ పంట అని పేర్కొన్నారు.
మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని ఆయన నివాసంలో వ్యవసాయ అధికారులతో పామాయిల్ సాగుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్ పామ్ పంటను మరింత విస్తృతంగా సాగు చేయించాలని, ప్రతి రైతుకు పామాయిల్ మొక్కలు అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ పంట 25 నుంచి 30 ఏళ్ల జీవన కాలం కలిగి ఉంటుంది, ఇతర నూనె పంటల కంటే మూడు రెట్లు అధిక దిగుబడిని, తక్కువ నీటి వినియోగంతో పాటు వ్యవసాయ ఆదాయ స్థిరీకరణకు అత్యుత్తమ మార్గం కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులకు ఆయిల్ ఫామ్ సాగు పై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు నేరుగా గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగవుతున్న పామాయిల్ పంటను చూసి రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోవాలి అని ఇది కేవలం పంట కాదు, భవిష్యత్ ఆదాయానికి బలం అని తుమ్మల వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మండల స్థాయి వ్యవసాయ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, యర్ర వసంతరావు, కోటగిరి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Onion Imports | ఒకే రోజు 141 లారీలు.. రాష్ట్రంలోకి భారీగా ఉల్లిగడ్డ దిగుమతి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు