Errolla Srinivas | మాజీ మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకల ఫ్లెక్సీలను ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాత్రికి రాత్రే తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
సీఎం ఫొటోలు, పీసీసీ చీఫ్ ఫొటోలు, కాంగ్రెస్ నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు నెలల తరబడి ఉంటే, హరీశ్ రావు ఫోటోలు ఒక్క రోజులో తొలగించడం రాజకీయ కక్ష సాధింపు చర్యనే అని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఇలాంటి నీచమైన దిగజారుడు రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ప్రభుత్వ అలసత్వాన్ని, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యాన్ని అనునిత్యం నిలదీసే నాయకుడు హరీశ్ రావు అని అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పుట్టినరోజున ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన హరీశ్ రావుకి ప్రజల్లో ఉన్న ఆదరణ, అభిమానం ఇసుమంత కూడా తగ్గదని అన్నారు. కేసీఆర్ తీర్చిదిద్దిన నాయకుడు, సముద్రమంతా ప్రజల మన్ననలు పొందిన సేవకుడు హరీశ్ రావు అని కొనియాడారు.
పరిధి దాటి నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార పక్షం అడుగులకు మడుగులోతుతున్న అధికారులకు ఎర్రోళ్ల శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. మూడేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ముఖ్యమంత్రిగా ఉండేది కేసీఆర్‌నే అని చెప్పారు. అప్పుడు ఇలాంటి దుశ్చర్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లరమల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.