Telangana | కుమ్రం భీం ఆసిఫాబాద్ : వన్య మృగాలు అంటేనే మనషులు హడలిపోతారు. అలాంటి మృగాలు గ్రామాల్లోకి రావడం సాధారణమైంది. సింహాలు, పులులు గ్రామ వీధుల్లో సంచరిస్తూ జనాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత పులికి ఓ కుక్క చుక్కలు చూపించింది. ప్రజలను పరుగులు పెట్టించిన ఆ చిరుత పులికి.. గ్రామ సింహం ఉరుకులు పెట్టించింది. శునకం దెబ్బకు చిరుత పులి చెట్టెక్కి కూర్చుంది. అయినా కూడా కుక్క తన అరుపులతో చిరుతను భయపెట్టించే ప్రయత్నం చేసింది. ఈ దృశ్యం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆవిష్కృతమైంది.
తిర్యాని మండలం చింతపల్లి గ్రామ శివారులో చిరుతపులి కలకలం రేపింది. గ్రామంలోకి ప్రవేశించిన చిరుతను ఓ కుక్క తరమడంతో అది భయంతో అక్కడే ఉన్న ఓ ఎత్తయిన చెట్టుపైకి ఎక్కి చిటారు కొమ్మన కూర్చుంది. ఈ కుక్క చెట్టుపైకి చూస్తూ అదేపనిగా మొరుగుతుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు ఏమై ఉంటుందా అని అక్కడికి వచ్చి పరిశీలించగా చెట్టుపైన చిరుత కూర్చుని కనిపించింది. దానిని చూసి షాకైన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు స్థానికులు చెట్టుపై కూర్చున్న చిరుతను తమ మొబైల్స్‌లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు, సిబ్బంది చిరుత పాదముద్రలు సేకరించారు. చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Telangana | తెలంగాణలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
KTR | ఇది చారిత్రాత్మక విజయం.. గొంగడి త్రిషకు ప్రత్యేక అభినందనలు : కేటీఆర్
Harish Rao | భేషజాలకు పోకుండా హైడ్రా దుకాణం బంద్ చేయండి : హరీశ్‌రావు