Harish Rao | హైదరాబాద్ : చిన్న చిన్న బిల్డర్లను రోడ్డున పడేస్తూ, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న హైడ్రాపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భేషజాలకు పోకుండా హైడ్రా దుకాణం బంద్ చేయాలని హరీశ్‌రావు హెచ్చరించారు. బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన హైదరాబాద్, తెలంగాణ స్వర్గధామంగా ఉండే. అద్భుతంగా పదేండ్లు వృద్ధిలో నడిచింది రియల్ ఎస్టేట్ రంగం. లక్షలాది మంది బతికారు. కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాల వల్ల.. రియల్ ఎస్టేట్ రంగం కుదైలైంది. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా హైడ్రా దుకాణాలు బంద్ చేయండి.. హైడ్రా వల్ల అపార్ట్మెంట్లు అమ్ముడుపోవడం లేదు. హైడ్రా భయంతో కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేకపోవడం, లోన్లు రాకపోవడం, భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారడం, నమ్మకం కుదరక చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
హైడ్రా పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశావు. విదేశాల్లో ఉన్న వారు ఇక్కడ ఇండ్లు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎందుకంటే హైడ్రాకు భయపడుతున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు కూడా భయపడుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి లాంటి చిన్న బిల్డర్లు.. ప్రభుత్వాన్ని గ్రాంట్, అప్పు అడగకుండా తాము బతుకుతూ పది మందిని బతికిస్తున్నారు. హైడ్రా పేరుతో పర్మిషన్లు ఉన్న ఇండ్లను కూలగొడితివి. కోర్టు మొట్టికాయలు వేయడంతో పర్మిషన్ల ఇండ్ల జోలికి వెళ్లడం లేదు అని ప్రకటన చేస్తివి. మరి కూలగొట్టిన ఇండ్ల సంగతి ఏంది..? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు.
మూసీ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తివి. ఆగమాగం, అనాలోచిత నిర్ణయాల వల్ల హైదరాబాద్‌లోని బిల్డర్లలో పాజిటివిటి లోపించింది. రియల్ ఎస్టేట్ ఆగమాగమైపోయింది. రేవంత్ నిర్ణయాల వల్ల పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు భూములు అమ్ముదామంటే కూడా అమ్ముడుపోతలేవు. కేసీఆర్ పాలనలో విదేశాల నుంచే కాకుండా ఉత్తర భారతదేశం వారు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పెట్టుబడిదారులు వెళ్తున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.
బిల్డర్స్ అసోసియేషన్స్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలి. మరే బిల్డర్‌కు ఇలాంటి సమస్య రాకూడదు. రేవంత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకుని, రెడ్డి కుటుంబాన్ని పరామర్శించాలి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దాలి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో ఎందుకు అనుమతులు ఆలస్యం అవుతున్నాయి. అధికారుల వేధింపులు ఎక్కువై పోయాయి. ముఖ్యమంత్రిగా, మున్సిపాల్ మంత్రిగా రేవంత్ రెడ్డినే చొరవచూపాలి అని హరీశ్‌రావు సూచించారు.
రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదు.. ప్రజల ప్రాణాలు ముఖ్యం. వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ రంగం పూర్వవైభవం పొందే విధంగా ప్రభుత్వం చొరవచూపాలి. ఆయన కుటుంబ సభ్యుల మాటలు వింటుంటే.. మూడు నాలుగు నెలల నుంచి ఎంతో క్షోభ అనుభవించినట్లు తెలుస్తుంది. ఎల్ఐసీలో ఉన్న రూ. 18 లక్షలు తీసుకొచ్చి అప్పులు కట్టి చనిపోయాడు. ఒక నిజాయితీ పరుడు. ఆత్మగౌరవం కలిగిన వాడు కనుక అవమానం పాలు కావొద్దు అని అప్పుల వారికి అప్పులు కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య పరిష్కారం కాదు.. కుటుంబ సభ్యులను బాధ పెడుతాయి.. ధైర్యంగా ఎదుర్కోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాల వల్లే చివరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబానికి అండగా నిలబడి పార్టీ తరపున సహాయం అందిస్తాం. అసోసియేషన్లు ముందుకు వచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలి అని హరీశ్‌రావు కోరారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వం హత్యే : హరీశ్‌రావు
Komuravelli | మూడో వారం అదే జోరు.. మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డికి.. ఆ రోగుల లక్షణాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
MLC Kavitha | జనగణన ఇంకెప్పుడు చేస్తారు..? కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత