చిక్కడపల్లి, మార్చి 3: కుమ్మెర గ్రామంలో రజక, దళిత కుటుంబాలపై దాడి చేసిన వారిపై హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, సర్పంచ్ తుకారంరెడ్డి, ఇతర నిందితులను వెంటనే అరెస్టు చేయాలని రజక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో మంగళవారం రజక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం రాష్ట్ర వైస్ చైర్మన్ ఎం.నరసింహ అధ్యక్షతన జరిగింది.
రజక వృత్తి దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ కుమ్మెర గ్రామం లో రజక, దళిత కుటుంబాలపై అమానుషంగా దాడి చేసి పసిపాపను హత్య చేసిన పెత్తందారులు, సర్పంచి తుకారం రెడ్డితో పాటు మరో 8 మందిలో ముగ్గురిని మాత్ర మే పోలీసులు అరెస్టు చేసి మిగితా వారిని కేసు నుంచి తప్పిస్తున్న తీరు చేస్తూంటే ప్రభుత్వమే నిందితులకు కొమ్ముకాస్తున్నట్లు ఉన్నదని ఆరోపించారు. వెంటనే నిందితులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మార్చి 5న లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలపనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రజక సంఘాల నాయకులు బాలపూర్ బాల్‌రాజ్, కృష్ణమూర్తి, జూపల్లి రాజశేర్, శ్రీలక్ష్మి, ఎదునూరి మదారు, గోపి రజక, అక్కడ శ్రీనివాస్, పెద్దాపురం కుమారస్వామి, సంపత్, మొగ్గ అనిల్‌కుమార్, చిట్యాల సంధ్య, మురళీ, తదితరలు పాల్గొన్నారు.