Instagram Reels | ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య ఇన్స్ట్రాగ్రాంలో రీల్స్ (Instagram Reels)చిచ్చుపెట్టింది. రీల్స్ చూస్తూ భార్య సకాలంలో వంట చేయడం లేదని ఆగ్రహించిన భర్త కట్టుకున్న భార్యను(Murders wife) కడతేర్చాడు. ఈ విషాదకర సంఘటన బెంగళూరులో(Bengaluru) ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ చెందిన ధీరజ్ కుమార్(24), రీమా కుమారి(20) పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉపాధి కోసం కొద్ది రోజుల క్రితం బెంగళూరుకు వలసొచ్చారు.
ధీరజ్ చిన్న చిన్న పనులు చేస్తుండగా రీమా కుమారి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. సవ్యంగా సాగుతున్న వీరి జీవితంలో ఇన్‌స్టా రీల్స్ ప్రాణాల మీదకు తెచ్చింది. రీల్స్ చూస్తూ రీనా కుమారి వంట, ఇంటి పని సరిగా చేయడం లేదని దంపతులు కొద్ది రోజులుగా గొడవపడుతున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన ధీరజ్ భార్య గొంతు నులిమి హత్య చేశాడు. రీమా కుమారి ఆఫీస్‌కు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహిరాళ్లు ఇంటికెళ్లి చూడగా దుర్వాసన వచ్చింది.
పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు తలుపులు తెరిచి చూడగా పరుపులో చుట్టి ఉన్న రీమా కుమారి మృతదేహం కనిపించింది. జూలై 27న జరిగిన ఈ హత్యోదంతంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బిహార్‌కు పారిపోయిన ధీరజ్‌ను అరెస్ట్ చేసి విచారించగా .. తన భార్య ప్రవర్తన తనకు నచ్చలేదని, అందుకే చంపేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.