హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎండలు క్రమంగా ముదురుతున్నాయి. దీంతో అనుకున్నట్టుగానే సోలార్ ప్లాంట్లల్లో అధికంగా విద్యు త్తు ఉత్పత్తి అవుతున్నప్పటికీ అదంతా వృ థాగా పోతున్నది. ఫలితంగా లక్షలు వె చ్చించి ఆ ప్లాంట్లను నెలకొల్పినవారికి తీవ్ర నష్టం జరగుతున్నది. సోలార్ నెట్ మీటర్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ఈ విషయమై డిస్కమ్ అధికారులను ప్రశ్నిస్తే.. సరిపడా స్టాక్ లే దని చెప్తున్నారు. దాదాపు 2 నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నది. మరో నెలరోజులు దా టినా మీటర్లు బిగించే పరిస్థితులు కనిపించడం లేదు. అధికారుల నిర్లక్ష్యంపై ప్లాంట్ల యజమానులు మండిపడుతున్నారు.
రాష్ట్రంలోని బహుళ అంతస్తు భవనాలు, గెటెడ్ కమ్యూనిటీలు పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుని 3 నుంచి 10 కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటికి ప్రతి నెలా ఈఎంఐలు కడుతున్నారు. అలా దాదాపు 5 వేల ప్లాంట్లు సిద్ధమయ్యాయి. వాటిలో విద్యుత్తు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. కేవలం గ్రిడ్‌తో అనుసంధానించడమే మిగిలిగింది. కానీ, మీటర్లు అందుబాటులో లేకపోవడం అందుకు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో రూ.లక్షలు వెచ్చించి ప్లాంట్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకపోవడంతో వాటి యజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సోలార్ నెట్ మీటర్ల కోసం ప్లాంట్ల యజమానులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. త్రీఫేజ్ మీటర్లు, సీటీ మీటర్లు, హెచ్‌టీ మీటర్ల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మీటర్ల కోసం డిస్కమ్ ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా ఫలితంగా లేకపోయింది. ప్రస్తుతం కొద్ది సంఖ్యలో మాత్రమే మీట ర్లు అందుబాటులో ఉండటంతో డివిజినల్ ఇంజినీర్లు లంచాలు పుచ్చుకుని వాటిని బిగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక్కో మీటర్‌కు రూ.20-30 వేల వరకు లంచంగా పుచ్చుకుంటున్నట్టు తెలుస్తున్నది. అలా బిగించిన మీటర్లను తనిఖీ చేసేందుకు వచ్చే అధికారులు కూడా అమ్యామ్యాల కోసం చేతులు చాస్తున్నట్టు సమాచారం.
సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న వారికి వెంటనే నెట్ మీటర్లు ఏర్పాటు చేసి, గ్రిడ్ సింక్రనైజేషన్ పూర్తి చేయాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ (టీఎస్ఈఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. డిమాండ్‌కు తగ్గట్టుగా తగినన్ని నెట్ మీటర్లను అందుబాటులో ఉంచాలని టీఎస్ఈఏ అధ్యక్షుడు బుర్రా అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి టీ శ్రీహరిబాబు, ఉపాధ్యక్షుడు రాజేశ్ పర్కాల, సంయుక్త కార్యదర్శి బాబు నాయుడు కోరారు. మీటర్లు లేకపోవడంతో రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్ట్‌లపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని, ఈ విషయంపై తాము అధికారులను సంప్రదించి, వినతులు సమర్పించినా ప్రయోజనం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.