సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 01:38:18

దిగువన కృష్ణమ్మ పరుగులు

దిగువన కృష్ణమ్మ పరుగులు

  •  ఎగువన తగ్గిన ఉద్ధృతి
  • శ్రీశైలం, సాగర్‌కు భారీ ఇన్‌ఫ్లో
  • గోదావరి బేసిన్‌లోనూ స్థిరంగా వరద

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణా బేసిన్‌లో దిగువన కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా.. ఎగువన ఉద్ధృతి కొంత తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం ఆల్మట్టికి రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా ఉన్న ఇన్‌ఫ్లో సాయంత్రానికి రెండు లక్ష క్యూసెక్కులకు తగ్గింది. దీంతో ఆల్మట్టి నుంచి దిగువకు లక్ష క్యూసెక్కులకు కుదించారు. కాగా, జూరాలకు ఆదివారం సాయంత్రం కూడా భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. కృష్ణాజలాలకు తుంగభద్ర తోడవ్వడంతో శ్రీశైలం వద్ద మూడు లక్షలకు పైగా ఇన్‌ఫ్లో నమోదు అవుతున్నది.  సాగర్‌ కూడా నిండుకుండలా మారడంతో అక్కడి నుంచి దిగువకు 2.83 లక్షల క్యూసెక్కుల జలాల్ని వదులుతున్నారు.  ఈ నీటి సంవత్సరంలో ఇప్పటివరకు 80 టీఎంసీలకుపైగా కృష్ణాజలాలు సముద్రంలో కలిశాయి. జూరాలలో 29 గేట్లు, శ్రీశైలంలో 10, నాగార్జునసాగర్‌లో 12 గేట్ల ద్వారా దిగువకు నీరు వదులుతున్నారు. అటు గోదావరి బేసిన్లో కూడా వరద ఉద్ధృతి కొనసాగుతున్నది. శ్రీరాంసాగర్‌కు 23 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా... జలాశయంలో నీటి నిల్వ 78 టీఎంసీల వరకు చేరుకున్నది. ఎల్లంపల్లికి వరద తగ్గి.. ఇన్‌ఫ్లో 13 వేల క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాణహిత, ఇంద్రావతి నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో పెరూరు వద్ద దాదాపు పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు పరుగులు తీస్తున్నది. దిగువన శబరి, ఇతరత్రా మార్గాల నుంచి వచ్చే వరదతో ధవళేశ్వరం బరాజ్‌ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 20 లక్షల క్యూసెక్కులకుపైగా ఉన్నది. అంటే గత కొన్ని రోజులుగా రోజుకు 200 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ క్రమంలో నీటి సంవత్సరం మొదలైన 73 రోజులకే ఏకంగా 1520 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలవడం గమనార్హం.

సరస్వతి బరాజ్‌ 15 గేట్లతో నీటి విడుదల

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతున్నది.  మహారాష్ట్రలోని ప్రాణహిత నుంచి వస్తున్న వరదతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది.   ఆదివారం సాయంత్రం 10.01 మీటర్ల ఎత్తులో 4,33,800 క్యూసెక్కుల  నీరు వస్తున్నది. సరస్వతి బరాజ్‌కు మానేరు, గోదావరి నుంచి 31,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. దీంతో 12 గేట్లు తెరిచి 25,000 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరి నదిలోకి వదులుతున్నారు.  అటు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమేపీ తగ్గుముఖం పడుతున్నది.  ఆదివారం ఉదయం 9 గంటలకు 47.80 అడుగులు,  సాయంత్రం 4 గంటలకు 45.80 అడుగులకు చేరుకున్నది. సోమవారం ఉదయానికి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. logo