Harish Rao | మెదక్ : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏది పడితే అది మాట్లాడితే నవ్వుల పాలవుతావ్. ఇజ్జత్, మానం పోతది.. చివరకు కుర్చీకున్న గౌరవం కూడా పోతది.. సీఎం కుర్చీ గౌరవాన్ని కాపాడు అని రేవంత్‌కు హరీశ్‌రావు చురకలంటించారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
మెదక్ జిల్లా మన గులాబీ జెండాకు అడ్డా. ఈ గడ్డ మీద ఇంకో పార్టీ గెలవలేదు. ఈ 25 ఏండ్లలో ఎంపీగా బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. రేపు కూడా మెదక్‌లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే. నిన్న సీఎం వచ్చి కేసీఆర్ ఈ పదేండ్లలో ఏం అభివృద్ధి చేయలేదు అని మాట్లాడిండు. నువ్వు మెదక్‌లో నామినేషన్ వేసేందుకు వచ్చావంటే అది కేసీఆర్ అభివృద్ధి వల్లే. మెదక్‌ను జిల్లా కేంద్రం చేయకపోతే ఇక్కడ నామినేషన్ వేసేవాడివా..? సంగారెడ్డిలో వేస్తుండే. ఈ జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది కేసీఆర్. మెదక్‌లో కలెక్టరేట్ కట్టిండు కాబట్టి నువ్వు వచ్చినవ్. మీ అభ్యర్థి తరపున నామినేషన్ వేశావ్. నిన్ను మెదక్‌కు రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాదే అని హరీశ్‌రావు తెలిపారు.
మెదక్‌ను ఇందిరా గాంధీ అభివృద్ధి చేసిండు అని రేవంత్ అంటుండు. అబద్దాలు చెబితే అతికేలా ఉండాలి. బీహెచ్ఈఎల్ను ఇందిరాగాంధీ తెచ్చిందన్నాడు. బీహెచ్ఈఎల్ 1952లో వచ్చింది. ఇందిరాగాంధీ ఎంపీ అయింది 1980లో. రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రైటర్ కూడా సరిగాలేడు. ఏది మాట్లాడితే అది నవ్వుల పాలు అవుతావ్.. ఇజ్జత్ మానం పోతది. చివరకు కుర్చీకున్న కూడా పోతుంది.. కుర్చీ గౌరవాన్ని కాపాడు అని హరీశ్‌రావుకు చురకలంటించారు.