వదిలేసిన నీళ్లు.. 734 టీఎంసీలు
గోదావరిలో మేడిగడ్డ మీదుగా వందలాది టీఎంసీల నీటిని వృథాగా వదిలేసిన కాంగ్రెస్ సర్కార్.. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా, ఇప్పుడు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘ఎల్ నినో’ను బూచిగా చూపిస్తున్నది. కరువు సాకుతో యాసంగిలో పంటలు వేయవద్దంటూ రైతుల పొట్టలు కొట్టేందుకు సిద్ధమైంది.
- మేడిగడ్డ మీదుగా వందరోజుల్ల్లో దిగువకు.. ఆగస్టులోనే అత్యధికంగా 350 టీఎంసీలు
- ఎల్లంపల్లి నుంచి 17.69 టీఎంసీలు కిందికి.. వృథాగా సముద్రం పాల్జేసిన సర్కార్
- తాగు, సాగునీటికి ఒడిసిపట్టని ప్రభుత్వం.. రాజకీయ కక్షతో గోదావరి నీళ్లు వృథా?
- కాళేశ్వరం నీటిని ఎత్తడంలో నిర్లక్ష్యం.. ఐఎండీ, డబ్ల్యూఎంవో హెచ్చరికలు బేఖాతర్
- సలహాలు వినలే.. రైతుల గోడు పట్టలే.. ఎల్ నినో సాకుతో ఇప్పుడు కుచ్చుటోపీ
- నీళ్లన్నీ పోయి ముప్పు ముంచుకొచ్చాక.. చుక్కనీరు వృథా చేయొద్దంటూ సుద్దులు
చుక్క నీటిని కూడా వృథా చేయొద్దంటూ ప్రజలకు సుద్దులు చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఒకటో, రెండో కాదు.. మూడున్నర నెలల్లో ఏకంగా 734 టీఎంసీల గోదావరి జలాలను వట్టిగ వదిలేసింది. కరువు తప్పదనే హెచ్చరికలు వచ్చినా.. సాగు, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంపులను నడిపి నీటిని ఒడిసిపట్టాలని మొదటినుంచీ బీఆర్ఎస్ మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టింది.
రైతుల ఆక్రందనలను వినకుండా.. ప్రజల తాగునీటి గోసను పట్టించుకోకుండా నీళ్లన్నీ వృథాగా పోయాక తీరిగ్గా వచ్చి ‘మేమేం చేయలేం’ అంటూ సర్కార్ చేతులెత్తేసింది. కేవలం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరొస్తుందనే ఒకే ఒక్క రాజకీయ కారణంతో కాళేశ్వరం నుంచి నీళ్లెత్తకుండా వందలాది టీఎంసీల గోదావరి నీటిని దిగువకు జారవిడిచింది. తీవ్ర కరువు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా, రైతులు, ప్రజల ప్రయోజనాలను బలిపెట్టి ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకొన్నది.
చుక్క నీటినీ వృథా చేయొద్దు!
కరువుతో పరిస్థితి చేయిదాటి పోయింది.. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులన్నీ వట్టిపోయినయ్.. రిజర్వాయర్లన్నీ ఖాళీ.. పంటలకు సాగు నీళ్లిచ్చే పరిస్థితి లేదు. తాగునీళ్లకు కూడా కష్టమే.. మేమేం చేయలేం.. రైతులు, ప్రజలే అప్రమత్తంగా ఉండాలి.. ప్రస్తుత పరిస్థితుల్లో చుక్క నీటిని కూడా వృథా చేయొద్దు.
-ఈ నెల 15న సమీక్షలో సీఎం రేవంత్
కరీంనగర్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గోదావరిలో మేడిగడ్డ మీదుగా వందలాది టీఎంసీల నీటిని వృథాగా వదిలేసిన కాంగ్రెస్ సర్కార్.. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా, ఇప్పుడు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘ఎల్ నినో’ను బూచిగా చూపిస్తున్నది. కరువు సాకుతో యాసంగిలో పంటలు వేయవద్దంటూ రైతుల పొట్టలు కొట్టేందుకు సిద్ధమైంది. నిజానికి కాళేశ్వరాన్ని సకాలంలో వాడుకొని ఉంటే, దేశమంతా కరువు వచ్చినా తెలంగాణ పచ్చగా ఉండేదనేది అక్షర సత్యం. దీనికి ఇప్పటికీ మేడిగడ్డ వద్ద 23 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు వెళ్తుండటమే అందుకు నిదర్శనం. యాసంగి పంటలు వద్దంటూ రైతులపైనే ఆంక్షలు పెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి పరాకాష్ట అనే విమర్శలు వస్తున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ప్రస్తుత సాగునీటి సంక్షోభం ప్రకృతి సృష్టించినది కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన మానవ నిర్మిత విపత్తే! అని నిపుణులే చెప్తున్నారు. ఎల్ నినో ముప్పు పొంచి ఉన్నదని తెలిసినా, వ్యూహాత్మక ప్రణాళికలు లేకుండా మేడిగడ్డ మీదుగా 734 టీఎంసీల నీటిని సముద్రంలోకి వృథాగా పోనిచ్చిన తీరు ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో వినియోగించుకోకుండా నిర్లక్ష్యం వహించి, ఇప్పుడు ఆ నెపాన్ని ప్రకృతిపై నెడుతూ రబీలో పంటలు వేయొద్దని చేతులెత్తేయడం రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచడమే అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కల్పతరువు కాళేశ్వరాన్ని తలాపున పెట్టుకొని.. రాష్ర్టాన్ని తిరిగి దుర్భిక్షంలోకి తీసుకెళ్తున్న సర్కార్ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కప్పిపుచ్చుకొనే ప్రయత్నాలు
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ జరిపిన తాజా కాంక్రీట్ నాణ్యత, స్ట్రక్చరల్ పరీక్షల్లో అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పియర్స్ సురక్షితంగానే ఉన్నాయని, పెద్దగా నిర్మాణ నాణ్యతా లోపాల్లేవని తేలింది. ఈ నేపథ్యంలో రూ.2,100 కోట్ల నుంచి రూ.2,500 కోట్లతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల సమగ్ర పునరుద్ధరణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ తాజా ప్రకటన ప్రకారం చూస్తే ఈ బరాజ్‌ల శాశ్వత మరమ్మతు పనులను వచ్చే నవంబర్ రెండో వారంలో ప్రారంభించి, 2027 వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. కానీ, ఇదంతా చూస్తే కాళేశ్వరం నీటిని ఎత్తిపోయడంలో రేవంత్ సర్కార్ ప్రజల్లో అభాసుపాలైన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికే తప్ప సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. రేవంత్ సర్కార్ ఆరంభంలోనే ఈ పనులు చేసి ఉంటే.. ఇప్పుడు ఈ దుస్థితి ఉండేదికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న లోపాలుంటే వాటికి మరమ్మతులు చేసి కాళేశ్వరాన్ని వినియోగంలోకి తీసుకురావాలంటూ ముందు నుంచీ బీఆర్ఎస్, రిటైర్డ్ ఇంజినీర్లు సూచిస్తూ వచ్చారు. అయినా సర్కార్ పెడచెవిన పెడుతూ వచ్చింది.

కన్నెపల్లి నుంచి ఎత్తిపోయొచ్చు?
మేడిగడ్డ వద్ద ఇప్పటికీ 23 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. నిబంధనల ప్రకారం చూస్తే కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే ఎఫ్ఆర్ఎల్ 93.50 ఉంటే మోటర్లు ఆన్ చేయవచ్చని అధికారులు చెపుతున్నారు. కాగా, ప్రస్తుతం 93.82 ఎఫ్ఆర్ఎల్ ఉన్నదని ఈ పరిస్థితుల్లో ఎత్తిపోయవచ్చని అధికారులే చెప్తున్నారు. ఒక వేళ ఇంకా ఇన్‌ఫ్లో తగ్గితే.. చిన్నపాటి కాఫర్‌డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంటుందని ఇంజినీర్లు చెప్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చిన నీటిని కూడా ప్రభుత్వం సరిగా వినియోగించలేదు. వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఎత్తిపోయడానికి కావాల్సిన కసరత్తు చేయకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు నుంచి జూన్ నుంచి అక్టోబర్16 వరకు మొత్తం 17.69 టీఎంసీలు దిగువకు (సముద్రం) వెళ్లిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. జూన్ నుంచి అక్టోబర్ 16 వరకు 56.53 టీఎంసీల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రాగా, ఇందులో 22.69 టీఎంసీలు మాత్రమే నంది పంపుహౌస్ ద్వారా ఎగువకు ఎత్తిపోశారు. మోటర్లు నిరంతరం నడుపకపోవడంతో 17.69 టీఎంసీల నీరు సముద్రం పాలైంది.
ఎండుతున్న పంటలు.. ఆందోళనలో రైతులు
నీటిని ఎత్తిపోయడంలో రేవంత్ సర్కార్ చూపిన నిర్లక్ష్యం ఇప్పుడు రైతులకు శాపంగా మారింది. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీళ్లు లేక భూగర్భజలాలు అడుగంటాయి. మరోవైపు కరెంటు కోతలతో రైతులు అల్లాడుతున్నారు. రెండు మూడు తడులు ఇస్తే.. పంటలు చేతికొచ్చే అవకాశం ఉన్నది. ప్రాజెక్టుల ద్వారా సాగునీరిచ్చే సత్తా, సామర్థ్యం ప్రభుత్వం వద్ద ఇప్పుడు లేదు. ఫలితంగా ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చే దశలో ఎండుతున్న పంటపొలాలను చూసి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఇప్పుడు లక్షలాది మంది రైతులపాలిట శాపంగా మారడమే కాదు.. తాగునీటికి కూడా కటకట ఏర్పడే ప్రమాదం నెలకొన్నది. ఈ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎల్ నినో ముసుగులో వచ్చే యాసంగి పంటలు సాగు చేయొద్దని, నీటిని ఎక్కువగా వాడొద్దని, కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల నుంచి మోటర్లు పెట్టి నీటిని తోడొద్దని ఆదేశాలిస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

