Harish Rao | మందబలంతో కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ వ్యవహారంలో రిటైర్డ్ ఇంజినీర్ల రిపోర్టులను తప్పుగా చదివారని ఆరోపించారు. మోటర్లకు మీటర్లు అంటూ లెటర్లైన్ మొత్తాన్ని తప్పించి చదివి అబద్ధాలు చెప్పారన్నారు. ఉదయ్ స్కీమ్‌తో రూ.30వేలకోట్లు వస్తుండే అని చెప్పే టైమ్‌లో సీఎం కలుగజేసుకొని ఆఫీసర్లు సంతకాలు పెట్టారని లెటర్ చదివారన్నారు. మందబలంతో శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పోతిరెడ్డిపాడును దగ్గరుండి బొక్క పెట్టించారని అని రేవంత్ ఆరోపణ చేస్తున్నారని.. ఉమ్మడి రాష్ట్రంలో తాము రాజీనామా చేసిన తర్వాతనే పోతిరెడ్డిపాడుకు జీవో విడుదలైందన్నారు. పులిచింతల ప్రాజెక్టు, నక్సలైట్లతో చర్చలు తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు 2005లో మంత్రి పదవులను ఒదులుకున్నామన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ ఎల్ఆర్ఎస్ ఉచితంగానే చేయాలని గతంలో కోర్టులో కేస్ వేశారని గుర్తు చేశారు. ఎల్ఆర్ఎస్కు డబ్బులు వసూలు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇప్పుడేమో రూ.14వేలు ఉన్న ఎల్ఆర్ఎస్ ధరలను రూ.18వేలకు పెంచి వసూలు చేద్దాం అనుకుంటున్నారన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాకు సిద్ధపడితే రేవంత్ జిరాక్స్ పేపర్ కూడా స్పీకర్‌కు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణకు వ్యతిరేకంగా రైఫిల్ పట్టుకుని బెదిరించిన వ్యక్తి.. రైఫిల్ రెడ్డి అయ్యాడన్నారు. ఒక్కనాడైన జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ పుణ్యం, దయతోనే రేవంత్ పదవులను అనుభవించాడన్నారు. బీఆర్ఎస్ పని ఖతం అంటున్నారని.. ఎన్నటికైనా మళ్లీ బీఆర్ఎస్ వస్తుందన్నారు. 1984 తర్వాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఫుల్ మెజారిటీ రాలేదని.. పొత్తులతోనే నెట్టుకొస్తోందని విమర్శించారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు వెళ్లినట్టు అసలు కాంగ్రెస్ వాళ్లకు పదవులు లేవంటూ ధ్వజమెత్తారు.