హనుమకొండ చౌరస్తా : సర్వైకల్ క్యాన్సర్ ( Cervical Cancer ) నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ ( HPV vaccine ) ను 14 సంవత్సరాలు పూర్తిచేసి 15 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు ఉచితంగా అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ (Collector Chahat Bajpai) అన్నారు.
హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆదివారం నగర మేయర్ గుండు సుధారాణి ( Gundu Sudharani ) తో కలిసి ప్రారంభించారు. అనంతరం బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ అందజేసి, వ్యాక్సినేషన్ ధృవపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు తల్లిదండ్రుల అనుమతి పత్రాన్ని కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, పరకాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, దశలవారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా విస్తరించనున్నట్లు చెప్పారు.
2006 నుంచే ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ రంగంలో అందుబాటులో ఉందని, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తల్లుల కమిటీలు, మెప్మా సిబ్బంది, డ్వాక్రా సంఘాలు, కార్పొరేషన్ సిబ్బంది గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ప్రస్తుతం మహిళల్లో బ్రెస్ట్‌క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, ఈ వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ ఎ.అప్పయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.