హైదరాబాద్, నవంబర్ 17 : జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ క్రమంగా తన పంతాను మార్చుకుంటున్నది. లగ్జరీ కార్లతోపాటు విద్యుత్‌తో నడిచే వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని వాహనాలను విడుదల చేసినప్పటికీ ఇక నుంచి విడుదలయ్యేవాటిలో వీటికి అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ, ఏపీలలో ఈవీ కార్లకు ఆదరణ క్రమంగా పెరుగుతున్నదని, ఇది వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి దోహదం చేయనున్నదన్నారు. కంపెనీ మొత్తం విక్రయాల్లో ఈవీల వినిమయం చాలా తక్కువగా ఉన్నదని, ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నదన్నారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్లోకి 40 కొత్త మాడళ్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఆయన..వీటిలో కొన్ని దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు.
మరోవైపు, ద్వితీయ శ్రేణి నగరాలతోపాటు తృతీయ శ్రేణి నగరాలపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. ఇటీవలకాలంలో మెట్రో నగరాలతోపాటు చిన్న స్థాయి నగరాల్లోనూ లగ్జరీ కార్ల అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయన్నారు.