భవిష్యత్తులో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డు గొప్ప గౌరవంగా రాణిస్తుందని చంద్రబాబు చెప్పినదాంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డు అనేది ఆషామాషీగానో.. లేక రవీంద్రభారతిలో చప్పట్లు, దుప్పట్లతోని ఇచ్చే ఆర్టిఫిషియల్ అవార్డులాంటిదో కాదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా..
– రామోజీ ఫిలింసిటీలో ఆదివారం జరిగిన అవార్డుల కార్యక్రంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): రవీంద్రభారతి వేదికగా కవులు, కళాకారులు, విజేతలకు ఇచ్చే అవార్డులన్నీ ఆర్టిఫిషియల్ (కృత్రిమ) అవార్డులేనని సీఎం రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘చప్పట్లు, దుప్పట్లతో ఇచ్చే అవార్డులు’ అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించారు. ఒక ప్రైవేట్ అవార్డును గొప్పది చేసి పొగిడే క్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల వేదిక అయిన రవీంద్రభారతి అవార్డులను తక్కువచేసి మాట్లాడారు. ఆదివారం రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి రవీంద్రభారతిలో ఇచ్చే అవార్డులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ‘భవిష్యత్తులో ఈ అవార్డు గొప్ప గౌరవంగా రాణిస్తుందని చంద్రబాబు చెప్పినదాంతో నేను కూడా ఏకీభవిస్తున్నా.
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డు అనేది ఆషామాషీగానో లేకపోతే రవీంద్రభారతిలో చప్పట్లు, దుప్పట్లతో ఇచ్చే ఆర్టిఫిషియల్ అవార్డో కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా’నంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ఆషామాషీ కాదంటూ కితాబిచ్చిన రేవంత్‌రెడ్డి.. రవీంద్రభారతి అవార్డులను మాత్రం చప్పట్లు, దుప్పట్ల కోసం ఇచ్చే అవార్డులంటూ కించపరచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను మేధావులు, కవులు, కళాకారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు రవీంద్రభారతి వేదికగా అవార్డులు అందుకున్న వారందరినీ అవమానించడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేట్ అవార్డు ఫంక్షన్లలో తమ రాజకీయ ప్రయోజనం కోసం ప్రభుత్వ వేదికగా ఇచ్చే అవార్డులను కించపరచడం శోచనీయమంటూ మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం పదుల సంఖ్యలో రవీంద్రభారతిలోని పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విజేతలు, కవులు, కళాకారులకు అవార్డులను సైతం అందజేశారు. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే రవీంద్రభారతిలో ‘మేడే’ ఉత్సవాలకు హాజరయ్యారు. కొలువుల పండుగ పేరిట ఆయన సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. నిరుడు పదో తరగతి ఫలితాలను కూడా రవీంద్రభారతి వేదికగా విడుదల చేశారు. సర్దార్ సర్వాయ్ పాపన్న 375 జయంతి ఉత్సవాల్లోనూ పాల్గొన్నారు.
ఇటీవల సురవరం సుధాకర్‌రెడ్డి మెమోరియల్ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొని ప్రసంగించారు. పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రవీంద్రభారతి వేదికగా ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. చివరికి రవీంద్రభారతి వేదికగా ప్రభుత్వ పరంగా నిర్వహించే ఉగాది పంచాంగం కార్యక్రమంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఇలా పదుల సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొని స్వయంగా ఆయన చేతులమీదుగా అవార్డులు అందించిన వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడటం దారుణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్థాయి వ్యక్తికి ఈ మాటలు సహేతుకం కావనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం సీఎం అందించిన అవార్డులన్నీ ఆర్టిఫిషియల్ అవార్డులేనా? అని ప్రశ్నిస్తున్నారు.
ఒక అంశంపై మాట్లాడేటప్పుడు ముందువెనక ఆలోచించాల్సిన అవసరం లేదా? అని నిలదీస్తున్నారు. రవీంద్రభారతి అవార్డులపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, కవులు, కళాకారుల కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 1961లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని ప్రారంభించింది. ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ శతజయంతికి గుర్తుగా ఆడిటోరియానికి ఆయన పేరు పెట్టింది. రవీంద్రభారతిని నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఇంత గొప్ప చరిత్రగల రవీంద్రభారతిని సీఎం రేవంత్‌రెడ్డి కించపరిచేలా మాట్లాడటంపై మేధావులు, కవులు, కళాకారులు, రాజకీయ వేత్తలు భగ్గుమంటున్నారు.