న్యూఢిల్లీ, మార్చి 2 : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో) వరుసగా మూడో ఏడాది ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీరేటును 2025-26 సంవత్సరం కోసం 8.25 శాతంగా ఖరారుచేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో 2024-25 సంవత్సరం కోసం వడ్డీ రేటును 8.25 శాతంగా ఈవీఎఫ్వో కొనసాగించింది. 2022-23లో 8.15 శాతం ఉన్న వడ్డీ రేటును 2023-24 సంవత్సరానికి 8.25 శాతానికి స్వల్పంగా పెంచిన ఈపీఎఫ్వో వరుసగా మూడో సంవత్సరం కూడా ఇదే రేటును కొనసాగించింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో సోమవారం సమావేశమైన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీని జమచేయాలని సిఫార్సు చేసినట్లు మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత సభ్యుల ఖాతాల్లో వడ్డీని ఈపీఎఫ్వో జమచేస్తుందని పేర్కొన్నది. నిర్వహణలో లేని ఖాతాల మూసివేత కోసం ఓ పైలట్ ప్రాజెక్టుకు సీబీటీ ఆమోదం తెలిపింది. రూ.1,000 అంతకన్నా లోపు క్లెయిమ్ చేసుకోని బ్యాలెన్సులను చెల్లించేందుకు ఉద్దేశించిన ఈ పైలట్ ప్రాజెక్టు కింద ఎటువంటి దరఖాస్తు తీసుకోకుండా ఈపీఎఫ్వో సభ్యుల ఖాతాలో డబ్బు జమచేయడం జరుగుతుంది. ఇది విజయవంతమైన తర్వాత దీన్ని రూ.1,000 కన్నా ఎక్కువ బ్యాలెన్సు ఉన్న ఖాతాలకు వర్తింపచేయాలని ఈపీఎఫ్వో భావిస్తున్నది.