Actor Ali | | నటుడు, మాజీ వైసీపీ నాయకుడు అలీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లోకి తాను ఎలా వచ్చారు? ఎందుకు పార్టీకి దూరమయ్యారు? అనే విషయాలపై ఓ ఇంటర్వ్యూలో అలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి. అలీ 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవి కూడా దక్కింది. ఎన్నికల సమయంలో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన అలీ.. ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగినప్పటికీ, తనకు తగిన గుర్తింపు లభించలేదనే అసంతృప్తితో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. చివరకు 2024లో వైసీపీకి దూరమయ్యారు. తాజాగా తన రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడిన అలీ.. తాను మొదటినుంచీ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని స్పష్టం చేశారు. అనుకోని పరిస్థితుల్లోనే రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.
ఎలాంటి పదవి లేదా వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా వైసీపీలో చేరానని, ఏదైనా ఆశించి ఉంటే ఒకటి, రెండేళ్లలోనే పార్టీని వీడి ఉండేవాడినని అన్నారు. ఎన్నికల సమయంలో తాను తన సినిమాల పనులను పక్కన పెట్టి పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశానని అలీ గుర్తుచేసుకున్నారు. పార్టీ కోసం తాను చేసిన కృషి ప్రజలకు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. అయితే అందుకు తగ్గ గుర్తింపు మాత్రం తనకు లభించలేదనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐదేళ్లకోసారి వాడుకుని వదిలేస్తే ఏ మనిషికైనా బాధగా ఉంటుంది కదా అంటూ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తనలాంటి వ్యక్తిని ఉపయోగించుకుని ఆ తర్వాత గుర్తింపు లేకుండా పక్కన పెట్టడం తనను బాధించిందని ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. తన పరిస్థితిని వివరిస్తూ అలీ చేసిన ‘కరివేపాకులా తీసి పారేశారు’ అనే కామెంట్స్ వైరల్‌గా మారాయి. సినీ రంగంలో తనకు ఎప్పటి నుంచో మంచి గుర్తింపు ఉందని, తనకు అన్నం పెట్టింది సినిమానే తప్ప రాజకీయాలు కాదని ఆయన స్పష్టం చేశారు. నాకు అన్నం పెట్టింది సినిమా.. రాజకీయాలు కాదు అంటూ అలీ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడానికి తన కెరీర్‌కు ఉన్న ప్రాధాన్యతను కూడా స్పష్టం చేస్తున్నాయి. సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా తనకు మంచి గుర్తింపు ఉందని, అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి గుర్తింపు లేకుండా ఉండాల్సిన అవసరం లేదనే భావనకు వచ్చినట్లు తెలిపారు.
రాజకీయాల్లో తనకు ఎదురైన అనుభవాల తర్వాత ఇక ఆ రంగం తనకు అవసరం లేదని నిర్ణయించుకున్నానని అలీ వెల్లడించారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి తన అసలు వృత్తి అయిన సినిమాల వైపు దృష్టి పెట్టినట్లు చెప్పారు. తన రాజకీయ ప్రయాణం గురించి అలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అయితే ఆయన వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారనే పూర్తి వివరాలతో పాటు, దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.