గద్వాల, నవంబర్17 : స్లాట్ బుక్ చేసుకొని సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల దగ్గరకు పత్తిని తీసుక వస్తే మిల్లర్లు సమ్మె చేస్తున్న కారణంగా పత్తిని కొనుగోలు చేయలేమని సీసీఐ అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన మల్దకల్, అయిజ మండలాల్లోని పలు గ్రామాల రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలను బీఆర్ఎస్వీ నాయకుడు కురువ పల్లయ్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా పత్తి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయినా అధికారుల మాటలపై నమ్మకం లేని రైతులు కలెక్టరేట్లో పత్తి వాహనాన్ని నిలిపి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మునిస్వామిగౌడ్, తులసీగౌడ్, మౌళాలి, గంగన్న, బాలరాజు, శ్రీనివాస్, ధర్మన్న తదితరులు మాట్లాడుతూ గత సోమవారం తాము సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించడానికి స్లాట్ బుక్ చేసుకున్నామన్నారు.
తాము వ్యయప్రయాసలకు ఓర్చి సీసీఐ కేంద్రానికి పత్తిని తీసుకొస్తే మిల్లర్లు సమ్మె చేస్తున్నారని అందువల్ల పత్తిని కొనుగోలు చేయలేమని అధికారులతో పాటు సీసీఐ వారు చేతులు ఎత్తేయడంతో ఏమి చేయాలో తోచక కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సీసీఐ ఎంత పత్తి కొనుగోలు చేయాలనే నిబంధన ఉంటే అంతే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐకి పత్తి కొనుగోళ్లలో ఎప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని రైతులు ప్రశ్నించారు. పత్తి కొనుగోలు చేయమని చెబితే తాము కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే వారం కాదని రైతులు అభిప్రాయపడ్డారు.
ఈ రోజు తమ పత్తి కొనుగోలు చేయక పోతే మళ్లీ స్లాట్ బుక్ అయ్యే వరకు చాలా రోజులు పడుతుందని దీంతో తాము నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఎట్టకేలకు సాయంత్రం వరకు పత్తి కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు పత్తి కొనుగోలు చేసే సీసీఐ కేంద్రం వద్దకు వెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు కూడా రైతులు తెచ్చిన పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయక పోవడంతో ఆగ్రహించిన రైతులు మరో సారి అయిజ-గద్వాల రోడ్డుపై ధర్నా నిర్వహించారు. తమ పత్తి కొనుగోలు చేసే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని రైతులు రోడ్డుపై భైఠాయించారు. రైతులకు పోలీసులు, అధికారులు నచ్చజెప్పుతున్నా వారి మాటలు రైతులు వినిపించు కోలేదు.పత్తి కొనుగోలు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు.
నిబంధనల పేరుతో పత్తి రైతులను కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కురువపల్లయ్య అన్నారు. పత్తి రైతులకు మద్ధతు తెలిపి ఆయన మాట్లాడారు.రైతులు స్లాట్ బుక్ చేసుకొని జిన్నింగ్ మిల్లుకు తీసుక వచ్చిన పత్తిని కొనకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుక వచ్చిన తర్వాత కొనడం లేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రైతులు తెచ్చిన పత్తిని మొత్తం కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.