Mohammad Raad : ఇరాన్ (Iran) కు మద్దతుగా హెజ్బొల్లా గ్రూప్ (Hezbollah group) ఇజ్రాయెల్ (Israel) పై దాడులకు పాల్పడటంతో.. లెబనాన్ (Lebanan) లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన కీలక నేత మహ్మద్ రాడ్ (Mohammad Raad) మృతిచెందినట్లు సౌదీ వార్తా సంస్థ అల్-హదత్ పేర్కొన్నది.
‘దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై సోమవారం ఇజ్రాయెల్ రక్షణ దళం వైమానిక దాడులు జరిపిందని, ఆ దాడుల్లో లెబనాన్ పార్లమెంట్‌లోని హెజ్బొల్లా బ్లాక్ అధిపతి మహ్మద్ రాడ్ మృతి చెందారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హెజ్బొల్లాకు చెందిన మరికొందరు ఉన్నతాధికారులు కూడా తమ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు ఐడీఎఫ్ తెలిపింది. అయితే వారి వివరాలు మాత్రం వెల్లడించలేదు.
ఇదిలావుంటే ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 31 మంది మృతిచెందగా.. 149 మంది గాయపడినట్లు లెబనాన్ వెల్లడించింది. హెజ్బొల్లా నేతలు లెబనాన్ రక్షణ కంటే ఇరాన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, వారి చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఐడీఎఫ్ నార్తర్న్ కమాండ్ చీఫ్ రఫీ హెచ్చరించారు. మొదట హెజ్బొల్లా తమపై రాకెట్ దాడులకు పాల్పడడంవల్లే ప్రతిదాడులు చేస్తున్నామని చెప్పారు.