హైదరాబాద్ : యూపీలో మాదిరిగానే తెలంగాణాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాలనలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ( MP Vaddiraju ) అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు . రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పేద ప్రజల ఇళ్లను నేలమట్టం చేస్తున్న విషయం రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) కి తెలియదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అరాచకాలపై మౌనంగా ఎందుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు .
గత రెండున్నర ఏళ్లలో రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు.. వెళ్తున్నారు.రాష్ట్ర అభివృద్ధి మాత్రం ముందుకు పోవటం లేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అధికారులు పేదల ఇండ్లను కూల్చివేయడం తో ప్రస్తుతం గాజాలా మారిందని పేర్కొన్నారు.యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు వెలుగుమట్ల పరిస్థితి అలానే ఉందని అన్నారు.
రాహుల్ గాంధీ ఖమ్మం వెళ్లి రోడ్డున పడ్డ ప్రజల దీనస్థితిని తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల కోసం పార్లమెంట్లో రాహుల్ కొట్లాడాలని కోరారు. పేద ప్రజల ఇళ్లు కూల్చిన చోటే కట్టించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని అన్నారు.