నకిరేకల్, జూలై 29: ఎమ్మెల్యే మీటింగ్‌లకు ఇందిరమ్మ, బతుకమ్మ చీరలతోనే మహిళా సంఘ సభ్యులు రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసం. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్లు దండుకునేందుకు ఇందిరమ్మ, బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు తప్ప వేరే మహిళలకు చీరలు పంపిణీ చేయరా అని, రెండున్నరేండ్లలో చేయ ని పనులను ఈ ఆరు నెలల్లో హడావుడిగా చేయడం ఎన్నికల కోసమేనని, 100 పడకల దవాఖానను ఇప్పటివరకూ ప్రారంభించకపోవడం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అసమర్థతే కారణమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌లోని సువర్ణ గార్డెన్లో బుధవారం చిరుమర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది వచ్చిన బతుకమ్మ చీరలను ఇప్పుడు బతుకమ్మ పండుగకు పంపిణీ చేస్తున్నారని, మున్సిపల్ ఎన్నికలు వస్తాయని ముందస్తుగా ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు బతుకమ్మ చీరలు పం పిణీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని, నకిరేకల్ పట్టణ ప్రజలకు మాత్రం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే బతుకమ్మ చీరలు, ఇందిరమ్మ ఇండ్లు గుర్తొస్తాయన్నారు. కేసీఆర్ హయాంలో 18 ఏండ్లు నిండిన ప్రతి చెల్లికి, అక్కకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తే ఇవాళ ఒక్క మహిళా సంఘం సభ్యులకు మాత్రమే చీరలు పంపిణీ చేయడం దుర్మార్గమన్నారు. మిగిలిన వారికి ఎందుకు చీరలు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీకి తీసుకొచ్చిన నిధులకు, పనులకు శంకుస్థాపనలు చేసిపెడితే, రెండున్నరేండ్లుగా పట్టించుకోని సీసీ, డ్రైనేజీ పనులను ఎందుకు హడావుడిగా చేయాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన అమృత్ తాగునీటి పథకం కింద రూ.25 కోట్లతో తీసుకొచ్చిన పనులను ఇప్పుడు ప్రారంభించారని, ఈ రెండున్నరేండ్లలో ఏం పనులు చేశారో విప్, ఎమ్మెల్యే వీరేశంను ప్రజల పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతో పేదవర్గాలకు హైవేపై వైద్యం అందుబాటులో ఉండాలని కోరితే వెంటనే రూ.36 కోట్లతో 100 పడకల దవాఖానను తీసుకువస్తే రెండున్నరేండ్లుగా ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదన్నారు. అన్ని ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందంగా ప్రభుత్వాసుపత్రి ప్రారంభించకపోవడం ఎమ్మెల్యే వీరేశం, ప్రభుత్వ అసమర్థతే కారణమన్నారు.
ప్రజా సమస్యలు పట్టించుకొనే పరిస్థితి లేదు..
మూసీగేట్ల లీకేజీ ద్వారా నీళ్లు వృథాగా పోతుంటే మరమ్మతులు చేయలేదు. నకిరేకల్ నియోజకవర్గంలో చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయని, వాటిని నింపే ప్రయత్నం చేయకుండా మంత్రి హోదా వచ్చిందని సంబురాలు చేసుకోవడం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రైతులు నార్లు పోసి, నాట్లేసిన తరువాత ఎల్‌నినో అనే కుంటిసాకుతో గంటల తరబడి కరెంట్ కోతలు విధిస్తున్నారన్నారు. కొంతమంది పోలీసులను పక్కన పెట్టుకొని బీఆర్ఎస్ బలంగా ఉన్న గ్రామాల్లో నాయకుల, కార్యకర్తల భూములను లాక్కొనే పరిస్థితి దాపురించిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎటువంటి ఫిర్యాదులు చేసినా పోలీసులు చెత్తబుట్టలో వేస్తున్నారని, వ్యక్తులంటే, వ్యవస్థ అంటే గౌరవం లేకుండా పోయిందన్నారు.
ఎమ్మెల్యే గన్‌మెన్ కోసం కడపర్తిలో బీఆర్ఎస్ నాయకుడి భూమిని లాక్కోవాలని రెండేండ్ల నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రైతు కుమారుడు పోలీసు వ్యవస్థలో ఉన్నా ట్రాన్స్ఫర్ చేయించి మరీ నల్లగొండ కేంద్రంలో వేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. రాజకీయాలు శాశ్వతం కాదని, పోలీసులు అధికారులు ఆచితూచి వ్యవహరించాలని హెచ్చరించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఎస్సైల మధ్య ఉన్న కేసుల ఒప్పందాలు ఎస్పీ దగ్గరకు వెళ్లడం లేదని, డీఎస్పీ సాధారణ పోస్టులాగా మిగిలిపోయిందని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ను కోరారు. మాజీ సర్పంచ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తే నకిరేకల్ సీఐ పరుషపదజాలంతో దూషించడం ఏంటని, పోలీసులంటే ప్రజలకు న్యాయం చేయడానికి కాదా అని ప్రశ్నించారు.
కోర్టు నోటీసులిచ్చినా చెత్తబుట్టలో వేసే సంస్కృతి నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో జరుగుతుందన్నారు. రెండున్నరేండ్లలో సమస్యల పరిష్కారం కాని బాధితులందరినీ ఏకం చేసి వచ్చే శుక్రవారం ఎస్పీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ తరాల బలరాం, మాజీ కౌన్సిలర్ పల్లె విజయ్, బీఆర్ఎస్ మండల యూ త్ అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్, సీనియర్ నాయకులు పెండెం సదానందం, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, నాయకులు ఎమ్‌డి అఖిల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.