చుంచుపల్లి, సెప్టెంబర్ 28 : సైబర్ నేరాల పట్ల సీనియర్ సిటిజన్స్ అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఎస్ఐ ఎస్.కె.జుబేదాబేగం అన్నారు. సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాల్లో భాగంగా సోమవారం విద్యానగర్ కాలనీలోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హాల్లో అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్‌కు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, జిల్లా సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ వరప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్ కార్యదర్శి సురేష్ కుమార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జుబేదాబేగం మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసేందుకు రోజుకో కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్‌కు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్ లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
– బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ఓటీపీ, ఏటీఎం/డెబిట్ కార్డు వివరాలు, పిన్ అడగడం
– కేవైసీ (KYC) పూర్తి కాలేదని, బ్యాంకు ఖాతా లేదా సిమ్ కార్డు నిలిపివేస్తామని బెదిరించి లింక్ పంపడం
– పోలీసుల పేరుతో డిజిటల్ అరెస్ట్ అంటూ వీడియో కాల్ చేసి భయపెట్టి డబ్బులు బదిలీ చేయించడం
– విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తామని చెప్పి నకిలీ లింకులు పంపడం
– బంధువులు లేదా స్నేహితుల పేరుతో వాట్సాప్‌లో మెసేజ్ చేసి అత్యవసరంగా డబ్బులు పంపాలని కోరడం
– తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పి నకిలీ షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ద్వారా డబ్బులు పెట్టించడం
– బహుమతి, లాటరీ లేదా రివార్డు వచ్చిందని చెప్పి ముందుగా పన్ను, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేయడం.
తెలియని వ్యక్తులకు OTP, PIN, CVV, పాస్వర్డ్లు, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాజేంద్రప్రసాద్, కే.గురుమూర్తి, పాండురంగారావు, అంజనానందం, జోసెఫ్, ప్రవీణ్ కుమార్, కేశవరావు, ప్రేమసాగర్, సామ్యూల్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు బాబూ ప్రసాద్, డాక్టర్ బత్తుల కృష్ణయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.

‘సైబర్ నేరాల పట్ల సీనియర్ సిటిజన్స్ అప్రమత్తంగా ఉండాలి’