సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): నాగోల్‌లో ఓ వ్యక్తి వాహనం చోరీకి గురికాగా బాధితుడు స్టేషన్‌కు వెళ్లి గతేడాది ఫిర్యాదు చేస్తే రెండు మూడు రోజుల తరువాత కేసు నమోదు చేశారు.. ఏడాదైనా పోలీసులు గుర్తించలేకపోయారు.. కాగా ఈ నెల 9న ఆ వాహనంపై టోలిచౌకీలో ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి చలాన్ జారీ అయ్యింది.. గుర్తించిన వాహన యజమాని పోలీసుల దృష్టికి తీసికెళ్లారు.. ఆ సరే లే చూద్దాం.. మీరే వెళ్లి వెతకండంటూ పోలీసులు సలహా ఇచ్చారు.
తిరిగి 21న మరోసారి ఆ వాహనంపై అదే ప్రాంతంలో చలాన్ పడింది. మళ్లీ వాహన యజమాని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.. పోలీసులు అదే సమాధానం… మేం ఏమి చేస్తాం.. మా దగ్గర ఇద్దరే కానిస్టేబుల్స్ ఉన్నారు.. మేం వెతకడం కుదరదు.. మీరు కావాలంటే అక్కడి పోలీసులను సంప్రదించండి.. వాళ్లు ఏదైనా సహాయం చేస్తారేమో చూడం డి… అంటూ సమాధానం చెప్పి .. విషయాన్ని పక్కన పెట్టారు.. ఇలాంటి ఘటనలు కేవలం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే కాదు… ట్రై పోలీస్ క మిషనరేట్ల పరిధిలో కోకొల్లాలు. పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పోలీసింగ్ గాడి తప్పుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైటెక్ పోలీసింగ్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు వేల సంఖ్యలో సీసీటీవీల నెట్ వర్క్, ఐటీఎంఎస్(ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్) అందుబాటులో ఉంది. గత బీఆర్ఎస్ హయాంలోనే అత్యాధునీక టెక్నాలజీ వ్యవస్థను ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రధానమైంది ఐటీఎంఎస్, చోరీకి గురైన వాహనాలను కూడా గుర్తించే వ్యవస్థ ఇందులో ఉంది, బీఆర్ఎస్ హయాంలో చోరీకి గురైన పలు వాహనాలను ఈ టెక్నాలజీతో గుర్తించి దొంగలను అరెస్ట్ చేసిన ఘటనలున్నాయి.
టెక్నాలజీ లా అండ్ ఆర్డర్ పోలీసు విభాగానికి కూడా పనిచేసే విధంగా సమర్థవంతంగా పలు క్లిష్లమైన కేసులను ఛేదించారు. కానీ నేడు ఆ నిబద్ధత కరువైంది, కనీసం ప్రయత్నం కూడా చేయకుండా చేతులెత్తేసే నయా ధోరణి బాధితులను మానసిక వేదనకు గురిచేస్తోంది. సిబ్బంది లేరంటూ సాకులు చెప్పే పరిస్థితికి నేడు పోలీసింగ్‌లో ఉండడం ఆందోళన కల్గిస్తోంది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో డిటెక్టివ్ విభాగం ఉంటుంది, ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆ విభాగానికి బాస్‌గా పనిచేస్తూ దొంగతనాలకు సంబంధించిన కేసులను ఛేదిస్తుంటారు.
చోరీకి గురైన వాహనాలకు సంబంధించిన వివారాలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపించాలి. అక్కడి డాటాబేస్‌లో చోరీ వాహనానికి సంబంధించిన వివరాలు పొందుపరుస్తారు. ఈ డేటా బేస్ ఐటీఎంఎస్ కెమెరాలకు కూడా అనుసంధానమై ఉంటుంది, అలాగే ట్రాఫిక్ పోలీసుల చేతిలో ఉండే ట్యాబ్‌కు కూడా అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా చోరీకి గురైందనే వాహనం ఫలానా ప్రాంతంలో ఉందని అక్కడ వెతికితే దొరకడం కష్టమే, ఇందుకు తగిన మానవ వనరులు అవసరపడుతాయి.
అయితే చోరీకి గురైన వాహనాల డేటా బేస్ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉండడంతో ఐటీఎంఎస్ కెమెరాల నుంచి ఆ వాహనం వెళ్తుందంటే కెమెరాలు గుర్తించి, కమాండ్ కంట్రోల్‌కు సిగ్నల్ ఇస్తాయి. అక్కడి నుంచి ఆయా కూడళ్లలో ఉండే పోలీసులకు కూడా అలర్ట్ వెళ్తుంది. ఫలానా జంక్షన్ నుంచి ఫలానా నంబర్ వాహనం వెళ్లిందనే సమాచారం క్షణాల్లో వచ్చేస్తుంటుంది. దీంతో ఆ తరువాత సిగ్నల్‌లో ఉండే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై, ఆ నంబర్ వాహనం అటు నుంచి వస్తుందంటే పట్టుకుంటారు. ఇలా గతంలో పలు వాహనాలను గుర్తించి పట్టుకున్న ఘటనలు ట్రై పోలీస్ కమిషనరేట్లలో ఉన్నాయి.
టెక్నాలజీని ఉపయోగించడం, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంపై ఉన్నతాధికారులు అంతగా దృష్టి సారించకపోవడంతో కిందిస్థాయిలో ఉండే సిబ్బంది కూడా అదే ధోరణితో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా మనకు చలాన్లు వేయడమే టార్గెట్ అనే ధోరణితో పనిచేస్తున్నారు. వాహనదారులపై చలాన్ల మోత మోగిస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు కూడా చలాన్ల వసూళ్లే లక్ష్యంగా పనిచేయిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. నాలుగు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు, ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తేనే టెక్నాలజీ కచ్చితంగా ఉపయోగపడుతూ కేసుల ఛేదనకు ఉపయోగపడేందుకు అవకాశముంటుందని నిపుణులు సూచిస్తున్నారు.