ముంబై, జూలై 29: బంగారం తాకట్టుపై రుణాలు తీసుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. ప్రస్తుతం రూ.18 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న బంగారం రుణాలు వచ్చే రెండేండ్లలో రూ.30 లక్షల కోట్లకు చేరుకోనున్నట్టు తాజా సర్వేలు అంచనావేస్తున్నాయి. బంగారం తాకట్టుపై రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థల్లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు దూసుకుపోతున్నాయని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. పసిడి రుణాల మంజూరులో బ్యాంకుల కంటే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు(ఎన్బీఎఫ్సీ)లు వేగంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయని పేర్కొంది. వీటి నిర్వహణలోని ఆస్తులు వచ్చే రెండేండ్లలో 35 శాతం మేర పెరుగనుండగా, మొత్తం బకాయిల్లో గతేడాది 22 శాతంగా ఉండగా, వచ్చే రెండేండ్లలో ఇది 23 శాతానికి ఎగబాకనున్నదని తెలిపింది.
బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు బంగారం తాకట్టుపై రుణాలు విరివిగా మంజూరు చేస్తున్నాయని, వీటి వృద్ధి సరాసరిగా 30 శాతం నుంచి 35 శాతానికి ఎగబాకుతున్నదని వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వార్షిక వృద్ధిరేటు 38 శాతంగా ఉండగా, వీటిలో బ్యాంకులు 35 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఎన్బీఎఫ్సీలు 54 శాతం పెరుగుదల కనిపించింది. రిటైల్ రంగంపై ఎన్బీఎఫ్సీలు మరింత దృష్టి సారించడం వల్లనే బంగారం రుణాలు భారీగా పెరిగాయని ఇక్రా వెల్లడించింది. బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు చిన్న స్థాయి నగరాల్లో సైతం తమ శాఖలను ఏర్పాటు చేయడంతో రుణాల లభ్యత మరింత సులువు అయింది.