మెదక్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : మెదక్ మున్సిపాల్ పరిధిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో అభివృద్ధి పనులు చేయకుండా వివక్ష చూపుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆమె వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిది వార్డులపై వివక్ష చూపుతున్నారన్నారు. మున్సిపాల్ చైర్ పర్సన్, కమిషనర్ ఎనిమిది వార్డులో పనులు చేయడం లేదని, అధికారులు పనులు చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులను అన్ని వార్డులకు సమానంగా పంపిణీ చేయాలన్నారు. టెండర్లు వేసి భూమి పూజ చూసిన పనులు ప్రారంభించడం లేదన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వార్డుల్లో సమానంగా అభివృద్ధి పనులు చేయాలన్నారు. విద్యుత్ దీపాలు, డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం చేయాలన్నారు. టెండర్లు వేసి మూడు నెలలు గడిచినా ఇంత వరకు పనులు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, జుబేర్‌అహ్మద్, ఖాజా సోహల్ మైనుద్దీన్, బట్టి ఉదయ్‌కుమార్, దీపక్‌కుమార్, మాయ గంగామణి, మల్లేశం, స్వరూప, ఫాతిమాఇమ్దాద్అలీ పాల్గొన్నారు.