హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ: రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఉద్యోగుల జేఏసీ సర్కార్‌కు తొత్తులా మారిందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయడంలేదని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య విమర్శించారు. అది ప్రభుత్వంపై పోరాటం చేయడంలేదని, ఇలాంటి జేఏసీలో తాము ఉండబోమని, జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరాపార్క్‌లో మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పెన్షనర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎంప్లాయీస్ జేఏసీ నుంచి వైదొలగాలని సభలో ప్రతిపాదించారు. పెన్షనర్లంతా జేఏసీలో ఉండకుండా, విడిపోయి పోరాటం చేయాలని తీర్మానించగా, సభ ఆమోదించింది. లక్ష్మయ్య మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తున్నది కదా.. ఎందుకు ధర్నా..?’ అంటూ కొందరు ఎంప్లాయీస్ జేఏసీ నేతలు తమ ధర్నాను వాయిదా వేయాలని తమను కోరారని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులు ఒకవైపు చనిపోతుంటే, ఉద్యోగుల జేఏసీ నేతలిలా మధ్యవర్తిత్వం చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పెన్షనర్ల సమస్యలపై సీఎస్‌కు నోటీసు ఇచ్చాం. మంత్రులను కలిశాం. అయితే మంత్రులు, లేదంటే సీఎస్ చర్చలకు పిలవాలి. కానీ, జేఏసీ నేతలు ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకోవడమేమిటి?’ అని నిలదీశారు.
జేఏసీ నేతల తీరును లక్ష్మయ్య తప్పుబట్టారు. ‘ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రెండుసార్లు కార్యాచరణ ప్రకటించి ఉపసంహరించుకుంటిరి. ఇదేనా మీ పోరాటం? బస్సుయాత్ర చేస్తమంటిరి. పెన్‌డౌన్‌కు దిగుతమంటిరి.. ఏమైంది? మా పెన్షనర్స్ సమస్యలను ఒక్కదాన్ని కూడా పట్టించుకోకపోతిరి. ఉద్యోగుల జేఏసీలో మేముండి ఏం లాభం?’ అని ప్రశ్నించారు. 36 సంఘాలతో కూడిన పెన్షనర్స్ జేఏసీ ఇక ఎంప్లాయీస్ జేఏసీలో ఉండబోదని, ఇకనుంచి ఉద్యోగులతో పెన్షనర్లకు సంబంధంలేదని స్పష్టంచేశారు. మూడు లక్షల మంది పెన్షనర్ల సమస్యలపై పెన్షనర్ల జేఏసీ పోరాడుతుందని తెలిపారు. సర్కారుతో తాడో.. పేడో తేల్చుకుంటామని, సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని జేఏసీ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. సాధారణంగా రిటైరైన నెల రోజుల్లోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ చెల్లింపులు జరుగుతాయని, కానీ ప్రస్తుతం నెలల తరబడి ఆలస్యమవుతున్నాయని చెప్పారు. దీంతో అప్పుల బాధలు పడలేక కొందరు, పిల్లల పెండ్లిళ్లు, చదువులు ఆగిపోయి అవమానాలపాలై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగ విరమణ పొందినవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే జీపీఏ పెన్షన్ తదితర బెనిఫిట్స్ అందడం లేదని పేర్కొన్నారు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే బెనిషిట్స్ ఇప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి పెన్షనర్లకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఆగిపోయాయని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, పీఆర్సీల ఊసేలేదని మండిపడ్డారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించి, పెన్షనర్ల అకాల మరణాలను ఆపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు పుల్లయ్య, భరత్‌రెడ్డి, మోహన్, జ్ఞానేశ్వర్, నరసరాజు, శివశరణప్ప, రమేశ్, నరసింహస్వామి, సూర్యనారాయణ, ఓంప్రకాశ్, నర్సింగ్‌రావు, చంద్రమౌళి, సుభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.