ఇల్లెందు, నవంబర్ 17: రేషన్‌షాపులో బియ్యం స్టాక్ తక్కువగా ఉన్నందున కేసు నమోదు చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన ఇల్లెందు సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) యాకుబ్‌పాషా ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ కథనం ప్రకారం.. ఈ నెల 7న ఇల్లెందు మండలంలో డీటీ యాకుబ్‌పాషా ఓ రేషన్‌షాపు తనిఖీకి వెళ్లాడు. ఆ రేషన్‌షాప్‌లో స్టాక్ తక్కువగా ఉన్నందున షాపు సీజ్ చేయకుండా, కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని టెక్నికల్ అసిస్టెంట్ విజయ్, రేషన్‌డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శబరిష్ ద్వారా డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ డీఎస్పీ రమేష్‌ను ఆశ్రయించాడు.
ఏసీబీ అధికారులు వల పన్ని సోమవారం ఉదయం శబరీష్‌కు ఇల్లెందు జగదాంబ సెంటర్లోని ఓ సెల్‌షాప్‌లో రేషన్‌డీలర్ డబ్బులు ఇస్తున్న క్రమంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శబరీష్‌ను ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేయగా డీటీ యాకుబ్‌పాషా, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఒత్తిడి మేరకే డీలర్ నుంచి రూ.30 వేలు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. 2011లోనూ డీటీ యాకుబ్‌పాషా కొణిజర్లలో ఓ వైద్యుడు నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి ఇంకా కేసు కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు.