Rice Shortage | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ‘దేశంలో బాయిల్డ్‌రైస్ (ఉప్పుడు బియ్యం) కన్నా రా రైస్ (పచ్చిబియ్యం) అవసరం ఎక్కువగా ఉన్నది. రా రైస్ ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే మీ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయబోం’- ఇదీ కేంద్రం తరుచూ రాష్ర్టానికి చెప్తున్నమాట. నిజంగా దేశంలో రా రైస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్నైట్టెతే రాష్ట్రం ఇచ్చిన రారైస్‌ను వెంటవెంటనే వినియోగించుకోవాలి. కానీ, కేంద్రం అలా చేయడం లేదు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నాలుగు నెలల క్రితం ఎఫ్‌సీఐకి ఇచ్చిన రారైస్ ఇప్పటికీ గోదాముల్లోనే మూలుగుతున్నది.
ఓవైపు రారైస్‌కు డిమాండ్ ఉన్నదని, కొరత ఉన్నదని చెప్తున్న కేంద్రం.. మరోవైపు అందుబాటులో ఉన్న బియ్యాన్ని తరలించకుండా జాప్యం చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని గోదాముల్లో ఎఫ్‌సీఐ 13 లక్షల టన్నుల బియ్యం నిల్వ చేసింది. ఇందులో 11 లక్షల టన్నులు రారైస్ కాగా 2 లక్షల టన్నులు ఉప్పుడు బియ్యం. దీనిని బట్టి కేంద్రం, ఎఫ్‌సీఐ రాష్ట్రంపై సాధిస్తున్న కక్ష ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. దేశంలో బియ్యం కొరత ఉన్నదంటూ నాన్ బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం.. రాష్ట్రంలోని గోదాముల్లో బియ్యాన్ని నెలల తరబడి నిల్వ ఉంచడం విమర్శలకు తావిస్తున్నది.
రారైస్ తప్ప బాయిల్డ్‌రైస్ తీసుకునే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం నష్టాలు భరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో యాసంగిలో ఉత్పత్తి అయ్యే ధాన్యం రారైస్ చేసేందుకు పనికిరావు. వీటిని మరపడితే ఎక్కువ నూక వస్తుంది. అయినప్పటికీ నూకల నష్టాన్ని భరించి రారైస్ ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధమైంది. వందల కోట్ల నష్టాన్ని భరించి కేంద్రానికి రారైస్ ఇస్తే, వాటిని గోదాముల్లోనే మురగపెడుతుండటం గమనార్హం.
కేంద్రం కోరినట్టుగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రారైస్ ఇచ్చినప్పటికీ, వాటిని ఇతర రాష్ర్టాలకు తరలించకుండా జాప్యం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంపై కక్ష సాధింపులో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలున్నాయి. ఎఫ్‌సీఐ ఉద్దేశపూర్వకంగానే రారైస్‌ను తరలించకుండా గోదాములను ఖాళీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తద్వారా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఇవ్వాల్సిన మిగిలిన సీఎమ్మాఆర్ను తీసుకోవడంలో ఆలస్యం చేయొచ్చన్నదే ఎఫ్‌సీఐ వ్యూహమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కేంద్రం చెప్పినట్టుగానే దేశంలో రా రైస్‌కు అధిక డిమాండ్ ఉంటే.. రాష్ట్రంలోని గోదాముల్లో మూలుగుతున్న రారైస్‌ను ఎందుకు తరలించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
‘యాసంగిలో వరి పండించవద్దు. ఒకవేళ సాగు చేసినా మాకు రారైస్ ఇవ్వాలి. బాయిల్డ్‌రైస్ ఇస్తే తీసుకోం. రైతుల నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు చేయబోం..’- ఇదీ 2021లో యాసంగి వరి నాట్లు వేసే ముందు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ చేసిన హెచ్చరిక. యాసంగిలో ఉత్పత్తి అయ్యే బియ్యం బాయిల్డ్ రైస్‌కే పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొరపెట్టుకున్నా కేంద్రం వినలేదు. తనను కలవడానికి వెళ్లిన తెలంగాణ మంత్రులను, ఎంపీలను పీయూష్‌గోయల్ అవమానిస్తూ తూలనాడారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పించండంటూ హేళన చేశారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతులకు శాపంగా మారడంతో సీఎం కేసీఆర్ నాడు రైతుల తరుపున కేంద్రంతో పెద్ద యుద్ధమే చేశారు. రైతుల కడుపు కొట్టవద్దని, బాయిల్డ్‌రైస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన ఢిల్లీ గడ్డపై ధర్నా చేశారు. రాష్ట్రంలోనూ పార్టీపరంగా ఆందోళనలు నిర్వహించారు. అయినా కేంద్రం మంకుపట్టువీడలేదు. కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి కారణంగా రైతులకు నష్టం జరుగొద్దనే ఉద్దేశంతో రైతులు పండించిన ధాన్యాన్ని ఎంత ఖర్చైనా, ఎంత నష్టమైనా సరే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించారు. ఇప్పుడు ఆ బియ్యాన్ని తరలించడంలో కేంద్రం జాప్యం చేస్తుండటం గమనార్హం.
రారైస్ మాత్రమే కావాలని మొండికేసిన కేంద్రం.. వాటిని తరలించకుండా నెలలపాటు గోదాముల్లోనే ఉంచడం దారు ణం. మేం నష్టాన్ని భరించి రా రైస్ ఇస్తే కేంద్రం చోద్యం చూస్తున్నది. కావాలనే రా రైస్ తరలించకుండా గోదాములను ఖాళీ చేయడం లేదు. ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరు ముమ్మాటికీ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యే. రైతులతో రాజకీయం చేయడం మంచిది కాదు. కేంద్రం
తీరు మార్చుకోకపోతే రైతులే తగిన బుద్ధిచెప్తారు.
-గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి
కేంద్రం డిమాండ్ మేరకు మిల్లర్లు నాలుగు నెలల క్రితం సరఫరా చేసిన 11 లక్షల టన్నుల బియ్యం ఇంకా గోదాముల్లోనే ఉన్నది. దేశంలో రారైస్‌కు డిమాండ్ ఉంటే.. వీటిని ఎందుకు తరలించడం లేదు? గోదాములను ఖాళీ చేయకుండా మిగిలిన సీఎమ్మాఆర్ ఇచ్చేందుకు స్పేస్ ఇవ్వడం లేదు. తిరిగి సకాలంలో బియ్యం ఇవ్వడం లేదంటూ మిల్లర్లను బద్నాం చేస్తున్నది. ఇప్పటికైనా రా రైస్‌ను తరలించి, గోదాములను ఖాళీ చేయాలి.
– గంప నాగేందర్, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
“Rice Shortage | మోదీ సర్కారు తలతిక్క నిర్ణయాలతో.. ప్రమాదంలో 145 కోట్ల మంది ఆహార భద్రత”