Rice Shortage | న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తత్తరపాటు నిర్ణయాలు దేశంలోని భారతీయులనే కాకుండా.. విదేశాల్లో ఉంటున్న భారత పౌరులను కూడా తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. బియ్యం ఎగుమతులపై మోదీ సర్కారు ఉన్నట్టుండి నిషేధం విధించటంతో అమెరికాలోని భారతీయులు.. ముఖ్యంగా బియ్యం అధికంగా తినే తెలుగువారు హాహాకారాలు చేస్తున్నారు. ముందుముందు బియ్యం దొరక్కపోవచ్చన్న భయంతో షాపింగ్ మాల్స్పైబడి బస్తాలకు బస్తాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లోని మాల్స్‌లో బియ్యం నో స్టాక్ అని బోర్డులు కనిపిస్తున్నాయి. అనేక మాల్స్ ముందు బియ్యం కొనేందుకు ప్రజలు కిలోమీటర్ల దూరం క్యూ లైన్లలో నిలబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఓహియోలోని మేసన్ పట్టణంలో ఉన్న స్టోర్లలో ఒక కొనుగోలుదారుకు ఒకటే బియ్యం బ్యాగు విక్రయిస్తామని షరతు పెట్టారు. బాస్మతితోపాటు అన్నిరకాల బియ్యం శుక్రవారం కొన్ని గంటల్లోనే అమ్ముడయ్యాయని మాల్స్ యజమానులు తెలిపారు.
అమాంతం పెరిగిన ధరలు
బియ్యం కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో మాల్స్‌లో ధరలను కూడా అదే స్థాయిలో పెంచేశారు. రెండురోజుల్లోనే బియ్యం ధరలు 11 శాతం పెరిగాయి.భారతీయులు అధికంగా ఉండే టెక్సాస్‌లో 20 పౌండ్ల సాధారణ బియ్యం సంచిని 34 డాలర్ల (రూ.2787.68) కు అమ్ముతున్నారని ఓ కొనుగోలుదారుడు వాపోయారు.
ప్రపంచమంతా ప్రభావం
భారత్ బియ్యం ఎగుమతులను నిషేధించటం ప్రపంచం మొత్తంపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. అత్యధిక బియ్యం ఉత్పత్తిదారు అయిన చైనాలో కూడా వాతావరణం అనుకూలించక దిగుబడి తీవ్రంగా పడిపోయింది.
Rice Shortage | దేశంలో పుష్కలంగా బియ్యం కొరత.. మోదీ ముందుచూపు లేని నిర్ణయాలతో ప్రజల తిప్పలు