Rice Shortage | హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ముందుచూపు లేని మోదీ సర్కారు ప్రజల ఆకలితో ఆడుకొంటున్నది. దేశ ప్రజల అవసరాలకు ఎంత ఆహార ధాన్యాలు అవసరమో కూడా తెలుసుకోలేంత గుడ్డితనంతో పాలస సాగిస్తున్నది. గోదాముల్లో నాలుగేండ్లకు సరిపడ బియ్యం నిల్వలున్నాయని ఢాంబికాలు పలికి ఏడాదిన్నర తిరగకముందే దేశంలో పరిస్థితులన్నీ తిరగబడ్డాయి. మా వద్ద మస్తు నిల్వలున్నయన్న నోటితోనే బియ్యం కొరత ఉన్నదని గగ్గోలు పెడుతున్నది. ధాన్యం ఉత్పత్తి పెంచి కొరత తీర్చడం చేతగాక.. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది.
కేంద్ర ప్రభుత్వ ముందుచూపులేని నిర్ణయాలపై దేశం యావత్తు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. పీయూష్ గోయల్.. పూటకో మాట బియ్యం, ధాన్యం నిల్వలపై కేంద్రం ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండుమూడు నెలల వ్యవధిలోనే నాలుగు మాటలు మార్చారు. దేశంలో నాలుగేండ్లకు సరిపడా బియ్యం నిల్వలున్నాయని పీయూష్ గోయల్ 2021 డిసెంబర్లో ప్రకటించారు. మరి ఆ ప్రకటన తర్వాత ఏడాదిన్నరకే దేశంలో బియ్యం కొరత ఎందుకు ఏర్పడిందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నుంచి ధాన్యం సేకరించాలని కోరితే.. నిల్వ చేయటానికి గోదాములు కూడా ఖాళీ లేవన్న కేంద్రం.. ఇప్పుడు కొరత ఉన్నదని ఎలా చెప్తుందని మండిపడుతున్నారు.
తెలంగాణ నుంచి ఒక్క గింజ ధాన్యం కూడా తీసుకోబోమని నాడు కేంద్రం మొండిగా వ్యవహరించింది. రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి ‘మా రాష్ట్రంలో భారీగా వరి దిగుబడి వచ్చింది. ఎఫ్‌సీఐ ద్వారా ఆ ధాన్యాన్ని సేకరించండి’ అని కోరినా.. ‘ మా దగ్గరే అవసరానికి మించి నిల్వలు ఉన్నాయి. మీ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోండి.’ అని పీయూష్ గోయల్ ఉచిత సలహా ఇచ్చారు. తెలంగాణ నుంచి మరాడించిన బియ్యం తీసుకొనేందుకు కూడా కేంద్రం కొర్రీలు పెట్టింది.
గోదాముల్లో ధాన్యం మురిగిపోతున్నది. దేశ అవసరాలకు నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలున్నాయి. కాబట్టి రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని మేము కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి రైతులను వరి సాగు నుంచి ఇతర పంటల సాగుకు ప్రోత్సహించండి. ధాన్యం పండిస్తే ఎగుమతులకు కూడా అవకాశం లేదు. తెలంగాణ నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదు.
– 2021 డిసెంబర్ 3న పార్లమెంటులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.
దేశంలో వరిసాగు తగ్గింది. భవిష్యత్తులో బియ్యం కొరత ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బియ్యం ఎగుమతులకు మంచి అవకాశం ఉన్నది. కాబట్టి రైతులను వరి సాగు చేసేలా ప్రోత్సహించండి.
– 2022 జూలై 6న రాష్ర్టాలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచన.
మీ రాష్ట్రంలోని ప్రజలకు నూకలు (బ్రోకెన్ రైస్) తినటం అలవాటు చేయండి. అంతేగానీ మేం మాత్రం తెలంగాణ నుంచి దొడ్డు వడ్లు కొనుగోలు చేయం.
– 2022 మార్చి 24న తెలంగాణ మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.
Rice Mill
కేంద్రం వరి సాగు వద్దనడంతో చాలా రాష్ర్టాలు సాగు తగ్గించాయి. దీంతో దేశ వ్యాప్తంగా సాగు 50 శాతం తగ్గిపోయింది. ధాన్యం ఉత్పత్తి తగ్గిపోయి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
దేశంలో వ్యవసాయాన్ని గాడిన పెట్టి ధాన్యం ఉత్పత్తి పెంచడం చేతగాకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నదని రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ వంటి చిన్న రాష్ట్రం అనతికాలంలోనే ధాన్యం ఉత్పత్తిని 200 శాతం పెంచినప్పుడు, దేశం మొత్తం ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నిస్తున్నారు. 2022 మార్చిలో నూకల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై 20 శాతం పన్నును విధించింది. దీనిపై అప్పట్లోనే పెద్ద దూమరం రేగడంతో వెనక్కి తగ్గింది.
కేంద్రం నిర్ణయం తెలంగాణ రైతులకు పెను శాపంగా మారనుంది. ఎగుమతి నిషేధించిన కొన్ని రకాలను తెలంగాణలో అధికంగా పండిస్తున్నారు. వీటిని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. తద్వారా రైతులకు మద్దతుకు మించి ధర లభిస్తున్నది. కానీ ఇప్పుడు ఎగుమతులు నిషేధంచడంతో వ్యాపారులు అధిక ధర వెచ్చించి ఈ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.
బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం వల్ల తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కేంద్రం ముందుచూపులేని విధానాలే ఈ పరిస్థితికి కారణం. తన అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నది. రైతుల పక్షాన ఆలోచించి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలి.
– తూడి దేవేందర్‌రెడ్డి, సౌత్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు