Rice Shortage | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): బియ్యం నిల్వల విషయంలో కేంద్రప్రభుత్వం పిల్లి మొగ్గలేస్తున్నది. పరస్పర విరుద్ధ నిర్ణయాలతో 145 కోట్ల మంది ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తున్నది. మోదీ సర్కారు తలతిక్క నిర్ణయాలతో ఇప్పటికే నిత్యావసరాలు, కమోడిటీస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా బియ్యం ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ధరల నియంత్రణ పేరుతో ఎగుమతులపై నిషేధం విధించినా పరిస్థితిలో మార్పేమీ రాలేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
కొరత అంటూనే కొనేది లేదని తిరకాసు
దేశంలో బియ్యానికి కొరత ఉన్నదన్న కారణంతోనే ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయినా, దేశీయంగా బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో బహిరంగ మార్కెట్లోకి భారీగా బియ్యాన్ని సరఫరా చేస్తేనే ధరల నియంత్రణ సాధ్యమవుతుంది. తెలివైన ప్రభుత్వమైతే నిల్వలు అధికంగా ఉన్నచోటు నుంచి తెచ్చి మార్కెట్లోకి వదులుతుంది. కానీ, మోదీ సర్కారు అందుకు విరుద్ధంగా పోతున్నది. తెలంగాణలో ఇప్పటికీ పుష్కలంగా ధాన్యం నిల్వలు ఉన్నాయి. మిలుల్లో సుమారు 1.10 కోట్ల టన్నుల ధాన్యం పేరుకుపోయింది. ఈ ధాన్యాన్ని మరాడించి ఇస్తాం తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ, కేంద్రం మాత్రం అందుకు విముఖత చూపుతున్నది. ఎఫ్‌సీఐ గోదాములు ఖాళీగా లేవంటూ మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవడం లేదు. నిజంగా కొరత ఉన్నదని భావిస్తే గోదాముల్లోని బియ్యాన్ని వెంటనే మార్కెట్లోకి విడుదల చేయాలి.
అప్పుడే కొత్త పంట మళ్లీ గోదాముల్లోకి వచ్చి చేరుతుంది. కానీ, ఎఫ్‌సీఐ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ రాజకీయం ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెల వరకు రాష్ట్రం నుంచి ప్రతిరోజు రైళ్ల ద్వారా సుమారు 200 ర్యాక్‌లను తరలించిన ఎఫ్‌సీఐ, ఈ నెల 90 ర్యాక్‌లను మాత్రమే తరలించినట్టు తెలిసింది. దీంతో గోదాములు ఖాళీ కావడం లేదు. ఈ సాకుతో మిల్లర్ల నుంచి బియ్యం తీసుకొనేందుకు ఎఫ్‌సీఐ నిరాకిస్తుస్తున్నది. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్ర మిల్లింగ్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. గత సీజన్ ధాన్యమే మిల్లుల్లో పేరుకుపోయింది. మరో నాలుగైదు నెలల్లో కొత్త ధాన్యం భారీగా వస్తుంది. ఆ ధాన్యాన్ని ఎక్కడ నిల్వచేయాలనే ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలంటే బియ్యం సేకరణను ఎఫ్‌సీఐ వేగవంతం చేయాలని పరిశ్రమవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఫోర్టిఫైడ్‌తో తొండాట
ఫోర్టిఫైడ్ రైస్ విషయంలోనూ ఎఫ్‌సీఐ రాజకీయం చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచి సీఎమ్మార్ (బియ్యం) సేకరణలో భాగంగా మిల్లర్లు ఇస్తున్న ఫోర్టిఫైడ్ రైస్‌లోని ఫోర్టిఫైడ్ కెర్నల్స్ నాణ్యత సరిగ్గా లేదంటూ బియ్యం తీసుకునేందుకు ఎఫ్‌సీఐ నిరాకరిస్తున్నది. గోదాములకు చేరిన బియ్యాన్ని వెనక్కి పంపింది. ఇప్పటివరకు సుమారు 308 మిల్లుకు సంబంధించి 2 వేల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను ఎఫ్‌సీఐ తిరస్కరించింది. దీంతో మిల్లింగ్ ఇండస్ట్రీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో విటమిన్-బీ, ఐరన్, ఫోరిక్ యాసిడ్ మిశ్రమం గల బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్)ను గత ఏప్రిల్ నుంచి ప్రజా పంపిణీలో భాగంగా ప్రజలకు అందిస్తున్నది.
బియ్యంలో కలిపే ఫోర్టిఫైడ్ కెర్నల్స్‌ను రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలే సరఫరా చేస్తున్నాయి. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సీసీఎఫ్) సంస్థలు పౌరసరఫరాల సంస్థకు ఫోర్టిఫైడ్ కెర్నల్స్ సరఫరా చేస్తున్నాయి. వాటిని పౌర సరఫరాల సంస్థ మిల్లులకు పంపిస్తున్నది. దీని ప్రకారం ఫోర్టిఫైడ్ కెర్నల్స్‌లో నాణ్యత లేకపోతే ఆ తప్పు వాటిని సరఫరా చేసిన నాఫెడ్, ఎన్సీసీఎఫ్దే అవుతుంది. ఎఫ్‌సీఐ మాత్రం ఆ తప్పును మిల్లర్లపై, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థపై నెట్టేస్తున్నది. ఎఫ్‌సీఐ తీరుపై రాష్ట్ర అధికారులు, మిల్లర్లు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సరఫరా చేసిన కెర్నల్స్ నాణ్యత లేకుంటే, దానికి తామెందుకు బాధ్యత వహించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ సోమవారం ఎఫ్‌సీఐకి లేఖ రాయనున్నారు. తిరస్కరించిన బియ్యాన్ని తీసుకోవాలని కోరనున్నారు. ఎఫ్‌సీఐ నుంచి సానుకూల స్పందన రాకపోతే 26న ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది.
దేశ ఆకలి తీర్చగల స్థితిలో తెలంగాణ
దేశంలో బియ్యం కొరత ఉన్నదని కేంద్రప్రభుత్వం చెప్తున్నది.. అందుకే ఎగుమతులపై నిషేధం విధించామని అంటున్నది.. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ర్టాలు బియ్యం కావాలని అడిగినా లేవని కరాఖండీగా చెప్పేసింది. కానీ, ‘మా దగ్గర ధాన్యం, బియ్యం భారీగా ఉన్నాయి. ఇస్తాం తీసుకోండి’ అని తెలంగాణ ప్రభుత్వం అడిగితే మాత్రం ‘మాకొద్దు’ అంటున్నది. కొరత ఉన్నప్పుడు మార్కెట్లో హెచ్చుతగ్గులను అదుపులోకి తెచ్చేందుకు ఏ ప్రభుత్వమైనా అధికంగా లభించే చోటునుంచి సరుకును తెస్తుంది. కానీ, మోదీ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ విషయంలోనే ప్రతిసారీ కక్ష సాధించేలా నిర్ణయాలు తీసుకొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల చర్యలతో తెలంగాణలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఏటా మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నది. మరో రెండేండ్లలో ఇది నాలుగు కోట్ల టన్నులకు చేరుకొంటుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. అంటే దేశం మొత్తం వార్షిక బియ్యం అవసరాల్లో దాదాపు సగం ఒక్క తెలంగాణే తీర్చబోతున్నది.