పిల్లల భవిష్యత్తు కోసం నేడు రకరకాల పెట్టుబడులు అందుబాటులో ఉన్నా యి. సుకన్య సమృద్ధి యోజన దగ్గర్నుంచి ఎన్పీఎస్ వాత్సల్య వరకు దేన్నైనా తమ చిన్నారుల విద్య, స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ఎంచుకోవచ్చు. తమకున్న ఆర్థిక వనరులనుబట్టి చిన్నచిన్న మొత్తాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే..
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై)
ఇది ఓ ప్రభుత్వ పొదుపు పథకం. ఆడపిల్లల తల్లిదండ్రుల కోసం కేంద్రం దీన్ని తీసుకొచ్చింది. ఇందులో పెట్టే పెట్టుబడులకు పన్ను మినహాయింపులుంటాయి. అలాగే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో అత్యధిక వడ్డీరేటు కూడా దీనికే ఉన్నది. గరిష్ఠంగా 8.2 శాతం పొందవచ్చు. కనిష్ఠంగా రూ.250తో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మొదలు పెట్టవచ్చు. ఖాతా తెరిచిన తేదీ దగ్గర్నుంచి 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ ఉంటుంది.
ఎన్పీఎస్ వాత్సల్య యోజన
దీర్ఘకాలిక రిటైర్మెంట్ నిధి కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద ఈ పథకాన్ని రూపొందించారు. పిల్లలకు 18 ఏండ్లు వచ్చేదాకా తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది స్టాండర్డ్ ఎన్పీఎస్ టైర్1 అకౌంట్‌గా దానంతటదే మారిపోతుంది. కనీస పెట్టుబడి వెయ్యి రూపాయలు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
చిన్నారుల దీర్ఘకాలిక సేవింగ్స్ ఫండ్ కోసం ఉన్నదే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). 15 ఏండ్ల లాకిన్ పీరియడ్, పన్ను మినహాయింపులు, అధిక వడ్డీ ప్రయోజనం వంటివి ఇందులో ఉన్నాయి. పిల్లల కోసం పెట్టుబడుల ఉపసంహరణకూ వీలున్నది.
రికరింగ్ డిపాజిట్ ప్లాన్లు
చాలా బ్యాంకులు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ పెట్టుబడులపై ఎక్కువ రాబడులు వీటి సొంతం. ఆయా బ్యాంకులను సంప్రదించి అధిక వడ్డీరేటున్నదానిలో పొదపు చేయవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్
హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.
ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ)
పొదుపు ఖాతాలు, సాధారణ ఎఫ్‌డీల కంటే వీటిలో వడ్డీ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. సురక్షిత పెట్టుబడులను కొరుకునే సంప్రదాయ ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించవచ్చు. ఎస్బీఐ, పీఎన్బీ, యెస్ బ్యాంక్ తదితర బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నాయి.