కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద వివిధ హోదాల్లో నియమితులైన వైద్య సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. కేంద్రం తన గ్రాంటును విడుదల చేసినా రాష్ట్ర సర్కారు తన వాటాను విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పల్లె దవాఖానల్లో పనిచేస్తున్న 44,201మంది వైద్య సిబ్బంది వేతనాలు అందక తిప్పలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు వైద్య సిబ్బంది రెడీ అవుతున్నారు. వీరికి వేతనాల కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు విడుదల చేసి వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ హయాంలో వీరికి ప్రతినెలా ఠంచన్‌గా వేతనాలు అందేవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్హెచ్ఎం ఉద్యోగులపై నిర్లక్ష్యం చూపుతూ వస్తున్నది. కేంద్రం 60 శాతం నిధులు చెల్లిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను జమచేయడం లేదని తెలిసింది. పీహెచ్సీలో మెడికల్ అఫీసర్, పల్లె దవాఖానల్లో ఎంఎల్‌హెచ్‌పీలు కీలక పాత్ర పోషిస్తారు. వేతనాలు పెంచకపోగా, ఉన్న వేతనాలనైనా నెలానెలా ఇవ్వాలని కోరుతున్నారు.