లింగంపేట, ఫిబ్రవరి 22: మండలంలోని పలు గ్రా మాల్లో చిరుతల సం చారం పెరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అడవుల్లో సంచరించాల్సిన చిరుతలు.. గ్రామీణ ప్రాంత పరిసరాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.పంట పొలా ల వద్ద కట్టివేసిన పశువులను చంపుతున్నాయి. గాంధీనగర్, ఎల్లమ్మ తండా, మోతె, బట్టిప్ప గడ్డ తండా, తాడ్వాయి మండలం ఎర్రపహాడ్, నందివాడ తదితర గ్రామాల్లో చిరుతల సంచారం పెరిగింది. దీంతో రైతులు రాత్రి వేళల్లో పంట పొలాల వద్దకు వెళ్లడానికి జంకుతున్నారు.
పంటలను కాపాడుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీనగర్‌లోని దేవీసింగ్‌కు చెందిన రెండు దూడలను గత శనివారం రాత్రి చిరుత దాడిలో మృతి చెందాయి. గత గురువారం రాత్రి అదే గ్రామంలోని షేక్ రజాక్‌కు చెందిన రెండు దూడలపై చిరుత దాడిచేయగా మృతి చెందాయి. శనివారం రాత్రి బట్టిప్ప గడ్డ తండాలోని మాలోత్ దేవీసింగ్, ఎల్లమ్మ తండాలోని సబావత్ రవికి చెందిన రెండు దూడలను చంపినట్లు తండావాసులు తెలిపారు. పశువులకు మేత అందుబాటులో ఉంటుందని పంట పొలాల వద్ద కట్టేస్తుంటే, చిరుతల దాడిలో అవి చనిపోవడంతో పశుసంపద తగ్గిపోతుందన్నారు.
బోను, స్నాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తాం..
గత శుక్రవారం గాంధీనగర్ గ్రామంలో చిరుత దాడిలో లేగదూడలు మృతిచెందగా, ఘటనా స్థలాన్ని అటవీశాఖాధికారులు సందర్శించారు. చిరుతలను పట్టుకోవడానికి బోనులతోపాటు వాటిని గుర్తించడానికి స్నాప్ కెమెరాలు ఏర్పా టు చేస్తామని వెల్లడించారు. అధికారులు చెప్పిన రెండు రోజుల్లోనే చిరుతలు వేర్వేరు ప్రాంతాల్లో మూడు దూడలను చంపేశాయి. వేసవి కాలం అరంభంలోనే నీటి కొరత ఏర్పడడంతో తాగునీటి కోసం పంట పొలాల వద్దకు వచ్చిన దూ డలను చంపుతున్నట్లు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతలను పట్టుకోవాలని కోరుతున్నారు.