వేల్పూర్, ఫిబ్రవరి 22 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని, రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ గతేడాది వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 44 మంది బీఆర్ఎస్ నాయకులు, రైతులపై అక్రమ కేసులు పెట్టింది. ఈ అక్రమ కేసులను నిరసిస్తూ వేల్పూర్‌లో ఆదివారం వేముల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు తరలివెళ్లారు.
పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న వారికి ఎస్సై సంజీవ్ నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న వేముల.. పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై అసహనం వ్యక్తం చేశారు. ఆనాడు నిరసన కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు.
బాల్కొండ నియోజకవర్గంలో 53 వేల మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22 వేల మందికే చేసి మిగితా 30 వేల మందిని మోసం చేశారని మండిపడ్డారు. ఐదు సీజన్లకు గాను మూడు సీజన్లు రైతుబంధు ఎగ్గొట్టారని, వడ్లకు రూ.500 బోనస్ అరకొరగా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో ఎరువులు రైతుల ముంగిట ఉండేవని, నేడు యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్లు వాడడం రాని రైతులపై యాప్‌ల నిబంధనలు రుద్ది వేధిస్తున్నారని తెలిపారు.
చట్టం రేవంత్‌రెడ్డికి చుట్టమా ?
గతంలో ఆంధ్రా పాలకుల హయాంలో కూడా లేని విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖునీ అవుతోందనని ఆందోళన వ్యక్తంచేశారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్‌గల్‌లో తులం బంగారం ఇవ్వాలని నిరసన తెలియజేస్తే 40 మంది నాయకులపై అక్రమ కేసులు బనాయించారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం విరోచిత పోరాటం చేసిన విద్యార్థి ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచినా బాల్క సుమన్‌ను జైల్లో పెట్టి గులాబీ పార్టీ అభ్యర్థి చైర్మన్ కాకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
అక్రమ కేసులు వేధింపులతో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంత అణచివేస్తే అంత రెట్టింపు ఉత్సాహంతో పోరాడుతామని హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన హామీలు, మహిళలకు నెలకు రూ.2500, పెన్షన్ల రూ. 4వేలకు పెంపు, తులం బంగారం వంటి హామీలు అమలు చేసే వరకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.