హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 3-4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం లేదని వాతావరణ అధికారి జీఎన్ఆర్ఎస్ శ్రీనివాస్ తెలిపారు.
గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి జిల్లా నాగలగిద్దలో 2.35 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా హూజూరాబాద్‌లో 2.11 సెం.మీ, మెదక్ జిల్లా నర్సింగిలో 2.03 సెం.మీ, నిజామాబాద్ జిల్లా వాయిల్పూర్లో 1.98 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 7 శాతం లోటు నమోదైందని, 13 జిల్లాల్లో మైనస్ 20 శాతంగా ఉన్నదని వెల్లడించారు.